Jagan- Chandrababu: ఎన్నికలకు ఇంకా 18 నెలల వ్యవధి ఉంది. కానీ ఏపీలో మాత్రం రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార, విపక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రజల మధ్య ఉంటూ వారి అభిమానాన్ని పొందేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలు చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్టు సాగనున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇద్దరు వ్యక్తిగత వైరం అన్నట్టు పోరాడుతున్నారు. సొంత నియోజకవర్గాల్లో మట్టి కరిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంపై సీఎం జగన్ ఫోకస్ పెంచగా… సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల్లో గట్టి దెబ్బ కొట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. అటు చేతిలో ప్రభుత్వం ఉండడంతో అభివృద్ది, తాయిలాలు అందించడం ద్వారా కుప్పంలో బలపడాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. అటు ప్రభుత్వ వైఫల్యాలు, వైఎస్ కుటుంబంలో తలెత్తిన విభేదాలను అందిపుచ్చుకొని పులివెందులలో పట్టుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరూ ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ఇంకా ఎన్నికలకు సమయం ఉం డడంతో ఎవరికి వారు దెబ్బతీయాలన్న ప్రయత్నంలో ఉన్నారు.

జోరుమీదున్న వైసీపీ…
అధికార వైసీపీ కుప్పంలో మంచి స్పీడు మీద ఉంది. అటు స్థానిక సంస్థలు, మునిసిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలనే దక్కించుకుంది. అప్పటి నుంచి చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ఓడించాలన్న కసితో సీఎం జగన్ పనిచేస్తున్నారు. నియోజకవర్గ బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. అటు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ భరత్ ను అన్నివిధాలా ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గ రివ్యూ జరిపిన జగన్ కుప్పంలో గెలిస్తే మాత్రం ఎమ్మెల్సీ భరత్ ను మంత్రిని చేస్తానని గట్టి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పట్టు బిగించేందుకు భరత్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంతో పాటు హింసాత్మక ఘటనలు వెనుక భరత్ ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే వరుస దెబ్బలతో చంద్రబాబు మేల్కొన్నారు. అటు పార్టీ కేడర్ ను భరోసా ఇచ్చేలా కుప్పంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. అటు నారా లోకేష్ సైతం అడపాదడపా నియోజకవర్గ పర్యటనలు చేసి టీడీపీ శ్రేణులను సమన్వయ పరుస్తున్నారు. అటు చంద్రబాబు కూడా నియోజకవర్గ రివ్యూలు ప్రారంభించారు. పులివెందుల పై కూడా ప్రత్యేకంగా కన్సంట్రేట్ చేశారు. అక్కడి శ్రేణులను అలెర్ట్ చేశారు.
Also Read: KCR National Party Announcement: నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. కషాయ పాలనపై కేసీఆర్ ఫైట్!
బాబుకు ఆహ్వానం..
అయితే తొలిసారిగా కుప్పం నియోజకవర్గంలో సీఎం జగన్ ఈ నెల 22న పర్యటించనున్నారు. కుప్పం మునిసిపాల్టీలో రూ.60 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలన్న చంద్రబాబు డిమాండ్ కు జగన్ సర్కారు ఆమోద ముద్ర వేసింది. కుప్పం రెవెన్యూడివిజన్ ను ఏర్పాటుచేసి చంద్రబాబును ఇరకాటంలో పెట్టింది. మరోసారి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. స్థానిక ఎమ్మెల్యేగా చంద్రబాబుకు అధికారులు ఆహ్వానం పంపనున్నట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు హాజరుకారని అందరికీ తెలిసిందే,. అయితే దీనిపై టీడీపీ కౌంటర్ అటాక్ ప్రారంభించింది. ఇన్నాళ్లూ లేనిది కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్ సర్కారు కొత్త ఎత్తుగడను వేసిందని అభిప్రాయపడుతోంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది.

భారీగా జన సమీకరణ..
అటు వైసీపీ శ్రేణులు మాత్రం సీఎం జగన్ కుప్పం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అటు మంత్రి పెద్దిరెడ్డి, ఇటు ఎమ్మెల్సీ భరత్ ఏర్పాట్లలో మునిగిపోయారు. భారీగా జన సమీకరణకు యత్నాలు ప్రారంభించారు. నేతలకు బాధ్యతలు అప్పగించారు. కనివనీ ఎరుగని రీతిలో జన సమీకరణ చేసి దాదాపు చంద్రబాబు పని అయిపోయిందని రాష్ట్ర వ్యాప్తంగా సంకేతాలు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అయితే దానికి దీటుగా టీడీపీ శ్రేణులు కూడా స్పందిస్తున్నాయి. నియోజకవర్గ ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియజెప్పేందుకు నిర్ణయించాయి. క్షేత్రస్థాయి సందర్శనలతో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు.
[…] […]