
Pulivendula: కడప… మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి పెట్టని కోట. ప్రభుత్వం ఏది ఉన్నా.. ముఖ్యమంత్రి ఎవరు ఉన్నా ఆ కుటుంబానిదే హవా. ఒక్క కడప ఏంటి.. దాదాపు రాయలసీమనే శాసించిన ఘనత ఆ కుటుంబానిది. ఆ గౌరవం దక్కడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎదుగుదలకు ఆ కుటుంబం మొత్తం సహకరించింది. అదే ఇప్పటి జగన్ ప్రస్థానానికి కారణమైంది. అయితే వైఎస్ వివేకా హత్య తరువాత ఆ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు గత చరిత్రను మసకబార్చాయి. సగటు వైఎస్ కుటుంబ అభిమానులకు మింగుడుపడడం లేదు. ఫస్ట్ టైమ్ పులివెందులలో సీఎం జగన్ ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు పెట్టడం చర్చనీయాంశమైంది. సాక్షాత్ సీఎం కోటలో ఆయన ఫొటో లేకుండా కుటుంబ అభిమానులు ఫ్లెక్సీలు పెట్టడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
పులివెందులలో పూల అంగడి సెంటర్ స్పెషల్. అక్కడ నిత్యం పొలిటికల్ ఫ్లెక్సీలు దర్శనమిస్తుంటాయి. ప్రధానంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి సీఎం జగన్ వరకూ వారి కుటుంబ ఫ్లెక్సీలే అధికంగా కనిపిస్తుంటాయి. దాదాపు అన్ని ఫ్లెక్సీల్లోనూ దివంగత రాజశేఖర్ రెడ్డి ఫొటో ఉంటుంది. సీఎం జగన్ తో పాటు కుటుంబసభ్యుల ఫొటోలకు ప్రాధాన్యమిస్తారు. అయితే ఇప్పుడు వైఎస్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అటు విజయమ్మ, షర్మిళ తదితరుల ఫొటోలన్నీ ఉన్నాయి. ఒక్క సీఎం జగన్ ఫొటొ తప్ప. ఇది పులివెందులలో చర్చకు దారితీసింది. జగన్ లేని వైఎస్ కుటుంబాన్ని చూస్తామనకుకోలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నేతల హస్తం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో సొంత మనుషులే ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వాస్తవానికి వివేకా హత్య జరిగిన తరువాత అసలు విషయాలు మరుగుపడక ముందు జయంతి, వర్థంతులు నిర్వహించేవారు. అంతెందుకు సీఎం జగన్ పులివెందుల వచ్చిన ప్రతీసారి రాజశేఖర్ రెడ్డితో పాటు వివేకానందరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించేవారు, అయితే ఇప్పుడు మాత్రం వర్ధంతి చేయడమే తప్పు అని భావిస్తున్నట్టున్నారు. అందుకే ఏర్పాట్లేవీ చేయలేదు. ఆ మధ్యన వివేకా హత్య కేసుపై కొడాలి నాని మాట్లాడుతూ హత్య తో జగన్ కు ఏం వస్తుంది? దినం ఖర్చే కదా అని వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు ఖర్చు అనుకున్నారేమో కానీ వివేకానందరెడ్డిని స్మరించుకోవడం కూడా మానేశారు. ఇది గ్రహించే పాపం కుటుంబ అభిమానులు సీఎం ఫొటో లేకుండా ఫ్లెక్సీలు కట్టారు.

ఇప్పటివరకూ వైఎస్ కుటుంబానికి కంచుకోటగా మారిన పులివెందుల్లో రాజకీయ సమీకరణలు మారే అవకాశముంది. వివేకానందరెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగిందన్న సానుభూతి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఇదే ప్రచారం ఊపందుకుంటే మాత్రం వైసీపీకి దెబ్బే. అటు వివేకానందరెడ్డి కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం ప్రజలు ఆదరించే అవకాశముంది. అంతకంటే ముందు ఆ కుటుంబంలో సైతం ఎక్కువ మంది మద్దతిచ్చే పరిస్థితులు ఉన్నాయి. అయితే వివేకా కుటుంబం రాజకీయాల్లోకి వస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే పులివెందులలో తాజా పరిణామాలు వైఎస్ కుటుంబ హర్ట్ కోర్ ఫ్యాన్స్ కు మాత్రం మింగుడు పడడం లేదు.