YS Viveka Birth Anniversary: వైఎస్ వివేకానంద రెడ్డి వైసీపీ నేత. ఆయన మరణించిన నాటికి వైసిపి లోనే యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఈ లెక్కన ఆయన జయంతి వేడుకలను ఏ రేంజ్ లో చేయాలి. కానీ నిన్న సాదాసీదాగా జయంతి వేడుకలు జరిగాయి. కేవలం ఆయన కుమార్తె సునీత మాత్రమే తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. ఇతర వైసీపీ నేతలు ఎవరూ నివాళులర్పించిన దాఖలాలు లేవు. అటు వైఎస్ కుటుంబంలో కూడా పెద్దగా హడావిడి లేదు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది.
వివేకా మరణించిన తర్వాత ఆయన జయంతి నాడు అబ్బాయిలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తొలి జయంతి నాడైతే వివేక విగ్రహాన్ని పెట్టేసి దండలు కూడా వేశారు. అవినాష్ రెడ్డి అయితే ఏడుపు ముఖంతో కనిపించారు. కానీ ఇప్పుడు వివేకానంద రెడ్డిని స్మరించుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ పెట్టలేదు. అబ్బాయిలు జగన్ అవినాష్లు మాత్రమే కాదు… వైసిపి వాళ్ళు ఎవరు వివేకానంద రెడ్డి విగ్రహాన్ని చూడడానికి కూడా ముందుకు రాలేదు.
వివేకా కేసులో వాస్తవాలు బయటకు రాక ముందు.. విచారణ జరిగే సమయంలో చాలా హడావిడి చేశారు. ఇప్పుడు నేరుగా వారి పేర్లు బయటికి రావడంతో.. సిబిఐ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. బాహ్య ప్రపంచానికి వాస్తవాలు తెలియడంతో అంటి ముట్టునట్టుగా వ్యవహరిస్తున్నారు. అసలు వివేకానంద రెడ్డి అంటే ఎవరో తెలియదు అన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఆయనకు నివాళులర్పించకపోయినా పోయేదేమీ లేదని తేలిగ్గా తీసుకుంటున్నారు.
ఇటువంటి సమయంలో నారా లోకేష్ వివేకానంద రెడ్డికి నివాళులర్పించారు. తండ్రి మరణం పై పోరాడుతున్న కుమార్తె సునీతను అభినందించారు. తప్పకుండా ఆమె విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. అదే సమయంలో ఇద్దరు అబ్బాయిలపై సెటైర్లు వేశారు. వారికి బాబాయి జయంతి గుర్తుండదు కానీ వర్ధంతి మాత్రం తప్పకుండా గుర్తుంటుంది. వేటు వేసిన చేతులతోనే బాబాయి జయంతికి ట్విట్ వేస్తే బాగోదనేమో వేయలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో లోకేష్ సెటైర్లు ట్రోల్ అవుతున్నాయి. ఎలా స్పందించాలో తెలియక వైసిపి వర్గాలు సతమతమవుతున్నాయి.