Jagan On AP Three Capitals: ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి బయటకు వచ్చింది. అమరావతి రాజధానికి మద్దతుగా రైతులు పోరాటం ఉధృతం చేస్తున్నారు. తమ పోరాడం 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ నెల 12న అమరావతి టూ అరసవల్లి యాత్ర చేపడుతున్నారు. అదే సమయంలో మంత్రులు విభిన్న ప్రకటనలు చేస్తున్నారు. అది మహా పాదయాత్ర కాదని.. ఉత్తరాంధ్రపై దండయాత్రగా పేర్కొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఏర్పాటుచేసి తీరుతామని ప్రకటిస్తున్నారు. ఎవరు అడ్డుపడినా ఆగేది లేదని చెబుతున్నారు. అమరావతికి మద్దతుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇంకా అమరావతి రైతులను మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

అమరావతి అంటేనే అక్కసు…
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే మూడు రాజధానులకు మద్దతుగా ముందుకు సాగుతోంది. అసెంబ్లీలో బిల్లును సైతం ప్రవేశపెట్టింది. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో బిల్లును ఉపసంహరించుకుంది. దానికి దీటైన బిల్లును మరోసారి ప్రవేశపెడతామని చెప్పుకొచ్చింది. ఇంతలో కోర్టు అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. రాజధానిలో ఆరు నెలల్లోగా మౌలిక వసతులు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ రకరకాల కారణాలు చూపుతూ ప్రభుత్వం పిటీషన్లు వేస్తూ కాలయాపన చేసింది. ఈ నెల 3 నాటికి కోర్టు అమరావతి రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు ఇచ్చిన గడువు ముగిసింది. అయినా ప్రభుత్వంలో చీమ కుట్టినట్టయినా లేదు.అటు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సవాల్ చేూస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లడం లేదు. ఇటు హైకోర్టు ఆదేశాలు పాటించడం లేదు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధానికి రైతుల నుంచి సేకరించిన భూమిలో రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల స్థలాలకు అప్పగించాలని నిర్ణయించింది. ఇందుకు సీఆర్డీఏ చట్టంలో సవరణలు సైతం చేసి కేబినెట్ ఆమోదించింది. దీంతో అమరావతి అంటేనే వైసీపీ సర్కారు ఏహ్యభావంతో చూసినట్టు కనిపిస్తోంది.
సాగర నగరంలో క్యాంప్ ఆఫీస్…
అటు అమరావతి రైతులు రాష్ట్రస్థాయి ఉద్యమానికి శ్రీకారంచుట్టడం, విపక్షాలన్నీ మద్దతు ఇవ్వడంతో జగన్ ఇప్పుడు వేగంగా ఆలోచించడం ప్రారంభించారు. న్యాయపరమైన చిక్కులు కొలిక్కిరాకుంటే విశాఖ నుంచే పాలన సాగించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. విశాఖలోని రుషికొండ వద్ద సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసి పాలనను అక్కడ నుంచి పర్యవేక్షించేలా సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సచివాలయాన్ని ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అటు న్యాయపరమైన చిక్కులు కొలిక్కి రాకపోవడమే ఇందుకు కారణం. అందుకే ఒక్క సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తే మూడు రాజధానులకు ముందడుగు వేసినట్టు అవుతుంది. అటు కర్నూలుకు హైకోర్టు తరలింపునకు చిక్కులు ఉన్నాయి. ఎలాగూ శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించినందున శాసనసభను అక్కడే ఉంచనున్నారు. సీఎం జగన్ మాత్రం తన వరకూ స్థానచలనం కోరుతున్నట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ?
అయితే సీఎం క్యాంపు కార్యాలయం విశాఖలో ఏర్పాటు విషయం అసెంబ్లీ సమావేశాల్లో కొలిక్కి వచ్చే అవకాశముంది. ఈ నెల 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అప్పటికే అమరావతి రైతుల మహా పాదయాత్ర 2.0 ప్రారంభం కానుంది. ఇప్పటికే పాదయాత్రను పలుచన చేస్తూ మంత్రులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అందుకే మూడు రాజధానులపై అసెంబ్లీలో చర్చకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతున్నా.. న్యాయపరమైన చిక్కులు కొలిక్కి వచ్చే వరకూ ప్రభుత్వ అటువంటిది చేయదని తెలుస్తోంది. పనిలో పనిగా సీఎం జగన్ క్యాంపు కార్యాలయం విశాఖలో ఏర్పాటుకు సంబంధించి క్లారిటీ ఇచ్చేఅవకాశమున్నట్టు మాత్రం తెలుస్తోంది.