Manmohan Singh Passed Away: అధికారులు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో.. అధికారం పోయిన తర్వాత ఎలా మారారో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అనుభవంలోకి వచ్చింది. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అధికారులను తన వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించుకునేవారు కాదు. దేశ అభివృద్ధి కోసం మాత్రమే వారితో మన్మోహన్ సింగ్ చర్చలు జరిపేవారు. అయితే నిజాయితీకి నిలువుటద్దం లాంటి మన్మోహన్ సింగ్ బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అధికార పక్షం ఆయనను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. లేనిపోని ఆరోపణలు చేసి ఆయన వ్యక్తిగత జీవితానికి మకిలి అంటించే ప్రయత్నం చేసింది.. ఆ క్రమంలో నాడు తన హయాంలో చోటు చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి వివరాలు అడగడానికి మన్మోహన్ సింగ్ ఒక అధికారికి ఫోన్ చేశారు. ఆయన ప్రధానమంత్రి ఆఫీస్ లో కీలక శాఖలో పనిచేశారు. సమాచారం కోసం మన్మోహన్ సింగ్ ఆ అధికారికి ఫోన్ చేయగా ఫోన్ ఎత్తలేదు. ఆ తర్వాత కొంత సమయానికి చేస్తాడని మన్మోహన్ సింగ్ భావించారు. కానీ ఆ అధికారి తిరిగి కాల్ కూడా చేయలేదు. ఇది మన్మోహన్ సింగ్ ను బాధించింది. అయితే నాటి ఒప్పందంలో అవకతవకలు జరిగాయని.. ఆ అధికారికి అందులో పాత్ర ఉండడం వల్లే అలా చేశాడని మన్మోహన్ సింగ్ భావించారు. ఆ ఆరోపణల నుంచి తనను తాను రక్షించుకోవడం కోసమే ఆ పని చేశాడని మన్మోహన్ సింగ్ ఒక అభిప్రాయానికి వచ్చా. ఆ అధికారి చేసిన పని వల్ల తనలో మనోధైర్యం తగ్గిపోయిందని మన్మోహన్ సింగ్ తన అంతరంగీకుల వద్ద వాపోయారు.
మీడియా కూడా..
ప్రధానమంత్రిగా దిగిపోయిన సందర్భంలోనూ మన్మోహన్ సింగ్ నిర్వేదంగా మాట్లాడారు..” మీడియా నన్ను పట్టించుకోలేదు. పట్టించుకోవాలని మీడియాని కూడా నేను కోరలేదు. నేను చేసిన పని గురించి రాయాలని అడగలేదు. మీడియా రాస్తే నాకు వచ్చే ప్రయోజనం గురించి ఆలోచించలేదు. పదేళ్లు నా పని నేను చేసుకుపోయాను. ఎదుటివారి పనిలో నేను వేలు పెట్టలేదు.. ఇబ్బందులు పడ్డాను. ఇబ్బందులను సహించాను. అయినప్పటికీ నేను నా దారిలో మాత్రమే ప్రయాణించాను. ఏనాడు కూడా దేనికోసం పాకులాడలేదు. పలానాది కావాలని అడగలేదు. స్థితప్రజ్ఞతను అలవరుచుకున్నాను. దానిని తది వరకు కొనసాగించాను. మీడియా నా గురించి ఈ సమాజానికి చెప్పకపోవచ్చు. సొంత పార్టీ నాయకులు ఆ విషయాన్ని చెప్పలేకపోవచ్చు. ప్రతిపక్షాలు ఆ అవకాశాన్ని కలిగించకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు ఈ దేశ చరిత్ర నన్ను స్మరించుకుంటుంది. నన్ను తన ఉజ్వలమైన భవిష్యత్తులో భాగంగా చేసుకుంటుంది. ఆనాడు నా జన్మ చరితార్థమైనట్టేనని” మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. నాడు మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించగా.. ఆ మాటలు విని కొంతమంది కాంగ్రెస్ నాయకులు నొచ్చుకోవడం విశేషం.