TDP And Janasena Alliance: టిడిపి, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటిస్తోంది. 60 మంది సిట్టింగ్లను మార్చింది. మరో 20 మందిని మార్చనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టిడిపి, జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను తయారు చేసే పనిలో చంద్రబాబు, పవన్ లు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు రా కదలిరా సభలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఫిబ్రవరి 4 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి పవన్ సైతం ఎన్నికల ప్రచార సభలు మొదలు పెట్టనున్నారు. ఇంతలో ఉమ్మడి అభ్యర్థుల విషయంలో కొంత స్పష్టతకు రావాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇటీవల రా కదలిరా సభల్లో ఇద్దరు అభ్యర్థుల విషయంలో చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. దీనిపై పవన్ స్పందిస్తూ తాను సైతం రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటన చేశారు. దీంతో పొత్తుపై ప్రతికూల వార్తలు వచ్చాయి. మరోవైపు వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తూ దూకుడు మీద ఉంది. దీనికి చెక్ చెబుతూ ఇద్దరు అధినేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటు విషయంలో స్పష్టత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటికి ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు గత నెల రోజులుగా రా కదలిరా పేరిట రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు.మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను.. 17 చోట్ల ఈ ప్రచార సభలు పూర్తయ్యాయి. ఇంకా ఎనిమిది చోట్ల మిగిలాయి. సీట్ల సర్దుబాటు కోసం పవన్ తో చర్చలు జరపనున్న నేపథ్యంలో ఈ సభలకు తాత్కాలికంగా వాయిదా వేశారు. వచ్చే నెల నాలుగు నుంచిమిగిలిన చోట్ల సభలు నిర్వహించనున్నారు. సీట్ల సర్దుబాటు తో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పై చంద్రబాబు, పవన్ తుది కసరత్తు చేయనున్నారు. రేపటి నుంచి నాలుగు రోజులు పాటు అదే పనిగా చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. పొత్తుకు విఘాతం కలిగించే అంశాల జోలికి పోకూడదని ఇరుపార్టీల శ్రేణులకు ఇద్దరు అధినేతలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే పవన్ తదుపరి కార్యాచరణ పై దృష్టి పెట్టనున్నారు. ఫిబ్రవరి 4 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. అనకాపల్లి నుంచి యాత్రలు మొదలు పెట్టనున్నారు. ప్రధానంగా కొన్ని జిల్లాలపై మాత్రమే పవన్ ఫోకస్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గాల్లో వారాహి యాత్రలతో పాటు అవసరం అనుకుంటే పాదయాత్రలు సైతం చేయనున్నారు. అయితే అంతకుముందే సీట్ల సర్దుబాటు విషయమై చంద్రబాబు వద్ద పవన్ స్పష్టత తీసుకోనున్నారు. ఈ సీట్ల సర్దుబాటుకు అనుగుణంగానే పార్టీలో చేరికలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. జనసేన కు లభించే సీట్లు, ఆశావహుల లెక్క చూసుకొని బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు పవన్ పావులు కదపనున్నారు. మొత్తానికైతే టిడిపి, జనసేన సీట్ల సర్దుబాటు విషయంలో వచ్చేనెల 4 నాటికి ఒక క్లారిటీ రానుంది.