Lok Sabha Election 2024: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని ప్రధాని మోడీ భావించారు. హ్యాట్రిక్ కొట్టి జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించాలని భావించారు. అది అంత ఈజీ కాదని తెలుస్తోంది. బిజెపి మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడం దాదాపు అసాధ్యమని స్పష్టమవుతోంది. ఇది కాషాయ దళంలో సెగలు పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా నెలన్నర పాటు ఎన్నికలు నిర్వహించి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం. ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించి.. తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావించారు. 21 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఒడిస్సాలో నాలుగు విడతల్లో పోలింగ్ నిర్వహించారంటే.. వారు ఎలా ఆలోచించారో అర్థం అవుతుంది.
భారతీయ జనతా పార్టీ ఒంటరిగా 370 స్థానాలను సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిత్రులతో కలిసి 400 సీట్లకు చేరుకోవాలన్నది టార్గెట్. కానీ మొదట విడత పోలింగ్ నాటి నుంచి వస్తున్న నివేదికలు చూసి ప్రధాని షాక్ కు గురయ్యారు. ఇప్పటివరకు 6 విడతల పోలింగ్ పూర్తయింది. రేపు తుది విడత పోలింగ్ జరగనుంది. ఇప్పటివరకు జరిగిన ఆరు విడతల పోలింగ్ సరళిని గమనిస్తే.. ఎన్డీఏ కు 250 సీట్లు రావడం గగనంగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో పాటు మిగతా పార్టీలు సైతం గణనీయమైన సీట్లు సొంతం చేసుకోనున్నాయి. 200 సీట్లు వరకు కైవసం చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో కాషాయ దళంలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టగలమా? లేదా? అన్న అనుమానాలు ప్రారంభం అయ్యాయి.
హ్యాట్రిక్ విజయం పై దృష్టి పెట్టిన బిజెపి రకరకాల ప్రయత్నాలు చేసింది. పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టింది. ఏకంగా 130 మంది అభ్యర్థులను మార్చింది. కొత్తవారికి అవకాశాలు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ, జెడిఎస్ వంటి పాత మిత్రులను సైతం చేరదీసింది. కానీ ఇవేవీ వర్కౌట్ అయ్యేలా కనిపించలేదు. ముఖ్యంగా ఏడు విడతల్లో పోలింగ్ అన్నది పూర్తిగా మైనస్ గా మారినట్లు తెలుస్తోంది. పోలింగ్ పోలింగ్ మధ్య గడువు వారం రోజులు గడువు దొరకడంతో.. విపక్షాలు సద్వినియోగం చేసుకున్నాయి. నిత్యవసర ధరలు, ప్రభుత్వ వైఫల్యాలు విపక్షాలకు కలిసి వచ్చాయి. మొత్తానికైతే హ్యాట్రిక్ కొట్టి పండిట్ జవహర్ లాల్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేయాలన్న.. మోడీ ప్రయత్నాలు నీరుగారిపోయినట్లు తెలుస్తోంది. మరి ఫలితాలు వస్తే కానీ దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.