AP Elections 2024: కౌంటింగ్ డేటు సమీపిస్తోంది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. దీంతో పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రాయలసీమ పై ఫోకస్ పెట్టింది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో భద్రతను పెంచింది. ఇప్పటికే మాచర్లలో కేంద్ర బలగాలు మొహరించడంతో పరిస్థితి అదుపులో ఉంది. అటు అనంతపురంలో సైతం పోలీస్ నిఘా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సైతం అలెర్ట్ అయ్యారు. పోలింగ్ నాడు, పోలింగ్ ముగిసిన తర్వాత హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. కౌంటింగ్ నాడు, కౌంటింగ్ తర్వాత ఇదే తరహా ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తోంది.
కడప జిల్లా పై ఈసీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అక్కడ ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ శాఖకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీస్ శాఖ అలెర్ట్ అయింది. జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్ల పై దృష్టి పెట్టింది. 21 మంది షీటర్లను జిల్లా బహిష్కరణ చేసింది. జూన్ 7 వరకు వీరిని జిల్లాలో అడుగుపెట్టనీయకుండా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరికొందరిపై గృహనిర్బంధం విధించింది. అయితే ఒక్కసారిగా కడప జిల్లా పై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టడం సంచలనం గా మారింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే.. చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా అక్కడ పోలింగ్ ముగిసింది. కానీ అటువంటి చోట పోలీస్ శాఖ పట్టు బిగించడం చర్చనీయాంశంగా మారింది.ప్రధానంగా కడప, పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు.
ఏపీలో హింసాత్మక ఘటనలు నేపథ్యంలో జూన్ 19 వరకు కేంద్ర బలగాలను కొనసాగించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కౌంటింగ్ నాడు ఉభయగోదావరి జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో వివాదాస్పద ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. మరోవైపు మూడు రోజుల్లో రాష్ట్రంలో 300 ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. మారణాయుధాలు, బాంబులు వంటి వాటి గురించి తనిఖీ చేశారు. మరోవైపు కేంద్ర బలగాలు భారీగా ఏపీకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టిడిపి కూటమి పార్టీలు.. తమ పార్టీ శ్రేణులకు స్పష్టమైన పిలుపులను ఇచ్చాయి. కౌంటింగ్ నాడు వైసిపి కవ్వింపు చర్యలకు దిగే అవకాశం ఉందని.. అందరూ సంయమనం పాటించాలని సూచించాయి. దీంతో అందరి వేళ్లు వైసీపీ వైపు చూపిస్తున్నాయి. మొత్తానికైతే కడప జిల్లా పై పోలీస్ శాఖ దృష్టి పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.