ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్స్ సంస్థపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్(Hyderabad) లోని సంస్థపై కేంద్ర ఆదాయ పన్ను విభాగం సోదాలు చేసింది. కరోనా మందుల తయారీలో పలు అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకున్న సంస్థపై దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. సంస్థ టోపిలిజుమాబ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో దాడులు చోటుచేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.

హైదరాబాద్(Hyderabad) లోని హెటిరో కార్యాలయాలతోపాటు ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లలోనూ దాడులు జరుగుతున్నాయి. సీఈవో కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించారు. హెటిరో అన్ని పరిశ్రమల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 20 బృందాలుగా విడిపోయి మూడు ప్రాంతాల్లో కార్యాలయాలు, ఇళ్లల్లో దాడులు నిర్వహిస్తున్నారు.
ఇందులో ఏవైనా ఆధారాలు లభించాయా? అనేది తెలియాల్సి ఉంది. గత ఫిబ్రవరి, మార్చిలో కూడా ఓ ఫార్మా కంపెనీపై ఐటీ అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. సదరు ఫార్మా సంస్థ రూ.4 వేల కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. ప్రస్తుతం హెటిరో సంస్థపై దాడులు జరగడంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. ఫార్మా కంపెనీలలో ఇంత మేర అక్రమాలు జరుగుతున్నాయా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కొవిడ్ చికిత్సలో ఉపయోగించే టోసిలిజుమాబ్ ఔషధం హెటిరోలోనే రూపొందిన సంగతి తెలిసిందే. కరోనా రోగులకు ఉపయోగించే ఈ ఔషధాన్ని సిఫారసు చేయడంతో దీని వినియోగం పెరిగింది. దీంతో వైద్యులు కూడా దీన్ని వాడాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫార్మా కంపెనీపై దాడులు జరగడం చర్చనీయాంశంగా మారుతోంది.