AP BJP: ఏపీలో విపక్షాల మధ్య పొత్తు కుదరక పోవడానికి వైసిపి యే కారణమా? జాతీయస్థాయిలో అవసరాలతోనే బిజెపి జాప్యం చేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయం కాస్త గందరగోళంగానే ఉంది. తెలుగుదేశంతో బిజెపి పొత్తు పెట్టుకుంటుందా? లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఏపీ రాజకీయాల్లో బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఈ ఏడాది కీలక సమయం. ఎన్నో ముఖ్యమైన బిల్లులను వరుస పెట్టి ఆమోదించుకోవాలని బిజెపి భావిస్తోంది. మరోవైపు విపక్ష కూటమి రోజురోజుకీ బలోపేతం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ సైతం పుంజుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయం లో జాగ్రత్తగా అడుగులు వేయకుంటే అసలుకే మోసం వస్తుందని మోడీ షా ద్వయానికి తెలుసు. అందుకే ఏపీలో పొత్తులను డిఫెన్స్ లో పెడుతూనే.. వైసీపీతో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.
రాజ్యసభలో వైసిపికి తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. బిజెపికి ఈ సంఖ్యాబలం చాలా అవసరం. కీలక బిల్లులు ముందుకు సాగాలంటే వైసిపి మద్దతు అవసరం. దీంతో జాతీయస్థాయిలో వైసిపి అవసరం బిజెపికి అనివార్యంగా మారింది. అందుకే ఏపీలో రాజకీయ ప్రయోజనాల కంటే.. జాతీయస్థాయిలో కలిగే లాభాలే బిజెపికి ముఖ్యం. అందుకే బిజెపి ఏపీలో పొత్తులను పక్కన పెట్టింది. కావాలనే జాప్యం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.