JanaSena-TDP Alliance: పొత్తు అనేది పరస్పర సహకారం, గౌరవంతోనే సాధ్యమవుతుంది. సీట్ల పంపకాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగితేనే ఆ కలయిక వర్కవుట్ అవుతుంది. ఓట్లు బదలాయింపు జరిగితేనే ఉభయతారకంగా ఉంటుంది. అయితే ఈ విషయంలో తెలుగుదేశం, జనసేన ఎలా ముందుకెళతాయో అన్నది ఇప్పుడు ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి వెళతాయన్న ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆ రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఉంది. జనసేనకు కేటాయించే సీట్ల విషయంలో టీడీపీకి స్పష్టత ఉంది. అదే సమయంలో తమకు బలమున్న చోట మాత్రమే జనసేన సీట్లను ఆశీస్తోంది.

వచ్చే ఎన్నికల తరువాత శాసనసభలో పదుల సంఖ్యలో ప్రాతినిధ్యం ఉండాలన్న బలమైన ఆకాంక్షతో పవన్ పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో 20 వేలకుపైగా ఓట్లు సాధించిన నియోజకవర్గాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అక్కడ టీడీపీతో సరిసమానంగా జనసేన ఓట్లు పొందింది. అటువంటి నియోజకవర్గాలను ఆ పార్టీ తప్పకుండా ఆశిస్తోంది. అయితే అదే నియోజకవర్గాల్లో ఈ మూడున్నరేళ్లలో బలం పెంచుకున్నట్టు టీడీపీ భావిస్తోంది. చంద్రబాబు తాజాగా చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అటువంటి నియోజకవర్గాల్లో ఇరు పార్టీలు ఎలా ముందుకెళతాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు పార్టీల మధ్య సమస్య తలెత్తుతోంది. వాస్తవానికి ఆ రెండు జిల్లాల్లో జనసేన గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. అందుకే అక్కడ ఎక్కువగా ప్రాతినిధ్యం కావాలని జనసేన వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే గోదావరి జిల్లాల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న వారే ప్రభుత్వం చేపడతారన్న ఒక సెంటిమెంట్ ఉంది. అందుకే చంద్రబాబు కూడా అక్కడ ప్రత్యేకమైన ఫోకస్ పెంచారు. అన్ని నియోజకవర్గాలపై దృష్టిపెట్టారు. అదే సమయంలో జనసేన సైతం ఆ నియోజకవర్గాల్లో బలం పెంచుకుంటూ వస్తోంది. దీంతో ఇరు పార్టీల బలాబలాలు అంచనా వేసుకొని సీట్ల పంపకానికి సిద్ధమవుతున్నాయి. కానీ కొన్ని నియోజకవర్గాల్లో జఠిలమయ్యే పరిస్థితులైతే మాత్రం కనిపిస్తున్నాయి.

పశ్చిమగోదావరి జిల్లాల్లో పొత్తులో భాగంగా జనసేనకు మూడు స్థానాలు పక్కా అన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంతో పాటు మరో స్థానం కేటాయిస్తారన్న ప్రచారం ఉంది. అయితే అనూహ్యంగా తాడేపల్లిగూడెం నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని టీడీపీ ఇన్ చార్జి బాబ్జీకి హైకమాండ్ నుంచి సమాచారం రావడం చర్చనీయాంశంగా మారింది. అక్కడ పోటీచేసేందుకు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 70 వేల ఓట్లు, టీడీపీ అభ్యర్థికి 54 వేల ఓట్లు, జనసేన అభ్యర్థికి 36 వేల ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన కలిస్తే ఇక్కడ ఏకపక్ష విజయమే కానీ.. మూడున్నరేళ్లలో తమ గ్రాఫ్ పెరిగిందని రెండు పార్టీలు అంచనా వేస్తున్నాయి. తమ కంటే తమకు సీటు కేటాయించాలని కోరుతున్నాయి. అయితే ఒక్క తాడేపల్లిగూడెం కాదు.. చాలా నియోజకవర్గాల్లో ఇదే రకమైన పోటీ ఉంది. ఎవరూ తగ్గడం లేదు. ఈ తరుణంలో అటు చంద్రబాబు, ఇటు పవన్ లు ఏ విధంగా లెక్కలు తేల్చుకుంటారో చూడాలి మరీ.