Minister Venugopalakrishna: తమిళనాడు తరహా రాజకీయాలు ఏపీలో ప్రారంభమయ్యాయి. రివేంజ్ లు, పగలు, ప్రతీకారాలతో పాటు సాష్టాంగ నమస్కారాల సంప్రదాయం ప్రారంభమైంది. మొన్నటికి మొన్న మంత్రివర్గ విస్తరణ, ప్రమాణస్వీకారం సమయంలో కొందరు మంత్రులు వయసుకు మించి వినయ విధేయతలు ప్రదర్శించారు. సీఎంకు నమస్కారాలు, ముద్దులతో తమిళనాడులో ఉన్న సంప్రదాయాలను గుర్తుచేశారు. పెద్దలను గౌరవించడం ప్రధాన విధి. కానీ వీర విధేయతలు ప్రదర్శించడం కాస్తా జుగుప్సాకరంగా ఉంటుంది. ఇటీవల అటువంటి ఘటనే ఒకటి చర్చనీయాంశమైంది. మాజీ ఎమ్మెల్యే కూడుపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ హాజరయ్యారు. అదే కార్యక్రమానికి వైసీపీ కీలక నేత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సైతం వచ్చారు. దీంతో సుబ్బారెడ్డిని చూసిన వేణు ఏకంగా ఆయన కాళ్లపై పడిపోయారు. అంతే ఈ ద్రుశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. దీనికి కులం కార్డు తోడు కావడంతో రచ్చ రచ్చగా మారిపోయింది. మంత్రి వేణుగోపాల క్రిష్ణ శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వారు. శెట్టిబలిజ సామాజికవర్గ ఆత్మాభిమానాన్ని పదవి కోసం రెడ్లకు తాకట్టు పెడతావా? అంటూ సోషల్ మీడియాలో తిట్ల దండకాన్ని పూనుకున్నారు. సొంత సామాజికవర్గం నుంచే మంత్రి వేణుకు నిరసన సెగ ఎదురైంది. శెట్టిబలిజా సామాజికవర్గ నేతలు, సంఘ నాయకులు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడ్డారు. అయితే ఈ ఘటనలతో మంత్రి నిశ్చేష్టులయ్యారు. వయసుకు పెద్ద అయిన వైవీ సుబ్బారెడ్డిపై గౌరవంతోనే తాను ఈ పనిచేశానని.. ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని సహచరుల వద్ద నొచ్చుకున్నారు. రాజకీయాల్లో ఏ చిన్న పని చేసినా వెనుకా ముందూ ఆలోచించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారట.

Also Read: KA Paul: తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనేనా?
సీరియస్ గా తీసుకున్న శెట్టిబలిజలు..
అయితే ఈ ఘటనను శెట్టిబలిజ వర్గీయులు సీరియస్ గా తీసుకున్నారు. బహిరంగంగానే మంత్రి వేణుపై విరుచుకుపడుతున్నారు. ‘రాజకీయ వ్యభిచారి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శనివారం అమలాపురంలో జిల్లాస్థాయి వైసీపీ ప్రజాప్రతినిధుల సమీక్షలో పాల్గొనేందుకు వేణుతోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జోగి రమేశ్, మంత్రి విశ్వరూప్, మిథున్‌రెడ్డి, పిల్లి సుభా్‌షచంద్రబోస్ వచ్చారు. మంత్రి వేణు కారు దిగిన వెంటనే ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ సంఘ కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు నాయకత్వంలో భారీ సంఖ్యలో శెట్టిబలిజలు, వైసీపీ కార్యకర్తలు ఆయన్ను చుట్టుముట్టారు. నినాదాలతో హోరెత్తించడమే గాక వ్యక్తిగత దూషణలకూ దిగారు. ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. శెట్టిబలిజల ఆత్మగౌరవాన్ని రాజకీయ లబ్ధి కోసం రెడ్ల ముందు వేణు తాకట్టు పెట్టారని.. ఆయన్ను మంత్రివర్గం నుంచి బహిష్కరించాలని సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. జోగి రమేశ్, మిథున్‌రెడ్డి, బోస్ కూడా నిరసనకారుల మధ్యలో చిక్కుకుపోయారు. బోస్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి జోక్యం చేసుకుని వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామంతో కంగుతిన్న వేణు మౌనంగా లిఫ్ట్‌లో సమావేశ మందిరానికి వెళ్లారు. ఆ తర్వాత… భద్రతా వైఫల్యంపై డీఎస్పీ, సీఐలపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలిసింది.
Also Read: Pawan TDP : ఏపీలో పొత్తులపై సంచలన ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్
Recommended Videos:



[…] […]