Vivek Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్.వివేకానంద హత్యకేసు డైలీ సీరియస్‌లా సాగుతోంది. ముగింపు మాత్రం పడడం లేదు. తాజా పరిణామాలు చూస్తే.. ఈ కేసులో సీబీఐ చేతులెత్తేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ అధికారులపైనే ప్రైవేటు ఫిర్యాదులు రావడం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు పెట్టడం చూస్తుంటే.. హత్య కేసు అటకెక్కినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఎన్నికల తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ కేసు విచారణ వేగవంతమై నేరస్తులకు శిక్ష పడుతుందని అంతా భావించారు. కానీ ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ కేసులోలో ప్రతి అంశం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ హత్య కేసులో విచారణకు పిలిస్తే… దర్యాప్తు అధికారి, సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ప్రైవేటు ఫిర్యాదులు దాఖలు చేస్తున్నారని సీబీఐ తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) హరినాథ్ హైకోర్టుకు వెల్లడించారు. పులివెందులకు చెందిన వెంకట కృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా యాడికి వాసి గంగాధర్‌రెడ్డి… సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై దిగువ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదులు వేశారని తెలిపారు.
సీబీఐ అధికారులపైనే కేసులు..
ప్రైవేటు ఫిర్యాదులతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సీబీఐ అధికారులపైనే కేసులు నమోదు చేయడం ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగదని కోర్టుకు తెలిపారు ఏఎస్‌జీ. వీటిని పరిగణనలోకి తీసుకొని గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు ఆధారంగా ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని వేసిన వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు.
మూడేళ్ల క్రితం పెను సంచలన..
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దర్యాప్తు కూడా సంచలనాలు రేపుతోంది. దర్యాప్తులో కీలక అంశాలు వెలుగుచూస్తున్న నేపథ్యంలో దీన్ని బయటపెడుతున్న సీబీఐ అధికారులపై కూడా కేసుల పరంపర మొదలైంది. అయితే ఈ కేసు దర్యాప్తులో కీలకంగా ఉన్న సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌ను టార్గెట్ చేస్తూ ప్రైవేటు కేసులు దాఖలవుతున్నాయి. దీనిపై తాజాగా హైకోర్టులో ఈ కీలక పరిణామం జరిగింది.
విచారణకు ఆటంకం కలిగించేందుకే..?
ఇప్పటికే ఈ కేసులో సీబీఐ కనిపెట్టిన అంశాల ఆధారంగా దర్యాప్తు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా ఆటంకాలు తప్పడం లేదు. కావాలనే ఆటంకం కలిగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సీబీఐ కూడా ఈ వ్యవహారంలో ముందుకు సాగలేని పరిస్ధితి కల్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా సీబీఐ నిందితులుగా గుర్తించిన వారిలో కొందరిని రిమాండ్‌కు పంపింది. మరికొందరి వాంగ్మూలాలు తీసుకుని వదిలిపెట్టింది. వీరిలో కొందరిని విచారణకు హాజరుకమ్మని సీబీఐ కోరితే హాజరుకాకుండా సీబీఐపైనే ప్రైవేటు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ వ్యవహారం మరో ట్విస్ట్‌గా మారుతోంది.

తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి అంటూ..
వివేకా హత్య కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాలని తనను సీబీఐ ఏఎస్పీ బెదిరిస్తున్నారంటూ గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి కడప ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్/ స్పెషల్ మొబైల్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసి, నివేదిక సమర్పించాలని మేజిస్ట్రేట్ కోర్టు దాన్ని ఠాణాకు రిఫర్ చేసింది. రిమ్స్ ఠాణా పోలీసులు సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఐపీసీ సెక్షన్ 195ఏ, 323, 506, రెడ్‌విత్ 34 కింద కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టేయాలని రామ్‌సింగ్ హైకోర్టును ఆశ్రయించగా… ఈ కేసులో తదుపరి చర్యలన్నింటిని నిలిపేస్తూ ఫిబ్రవరిలో న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అయితే సోమవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది. తీర్పు దస్త్రాల అదృశ్యంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ కేసులు అధికారులు చేతులెత్తేసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.