వైసిపిలో ప్రధాన అధికార కేంద్రానికి దూరంగా నెట్టివేయబడినప్పటి నుండి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో తానే `నిజమైన బాస్’ అని నిరూపించుకోవడం కోసం వైసిపి ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి ఎన్నో తిప్పలు పడుతున్నట్లు కనిపిస్తున్నది.
నిత్యం రెచ్చగొట్టే మీడియా ప్రకటనల ద్వారా తన రాజకీయ ఉనికి కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని సొంతపార్టీ వారే పలువురు భావిస్తున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ జాతీయ నాయకత్వం విధానాలకు భిన్నంగా మాట్లాడుతున్నారని అంటూ విజయసాయిరెడ్డి ప్రకటించడం చాలామందికి విస్మయం కలిగించింది.
బిజెపి జాతీయ నాయకత్వం విధానాల గురించి మాట్లాడానికి ఆయన ఏమైనా ఆ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో లోటుపాట్లను నిత్యం ఎత్తిచూపుతూ, అర్ధవంతంగా కన్నా చేస్తున్న విమర్శలు వైసిపి నాయకత్వాన్ని ఇరకాటంలో పడవేస్తుండడం అందరికి తెలిసిందే.
అందుకని ఇప్పటి వరకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకొని నిత్యం విమర్శలు గుప్పించే విజయసాయిరెడ్డి ఇప్పుడు కన్నాను చేసుకున్నట్లు కనిపిస్తున్నది. పైగా, విజయసాయిరెడ్డి విమర్శలను చంద్రబాబు అసలు పట్టించుకొనక పోవడంతో, ప్రజలు కూడా సీరియస్ గా తీసుకోవడం లేదని గ్రహించినట్లున్నారు.
అందుకనే ఇప్పుడు కన్నా వైపు దృష్టి సారించినట్లున్నారు. పైగా, చంద్రబాబు చేసే విమర్శల కన్నా కన్నా చేస్తున్న విమర్శలే సూటిగా, పదునుగా అధికార పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.
1990వ దశకం నుండి చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేస్తూ వస్తున్న కన్నాను టిడిపి వాళ్లంతా ఒక విధంగా `ద్వేషిస్తారు’ అని చెప్పవచ్చు. కానీ జగన్ పాలనపై చేస్తున్న విమర్శలను మాత్రం వారంతా ప్రశంశింపకుండా ఉండలేకపోతున్నారు. చంద్రబాబు కన్నా పదునుగా జగన్ ను నిలదీస్తున్నారని కూడా భావిస్తున్నారు.
అందుకనే కన్నా విమర్శలు వైసిపి నేతలకు ఆత్మరక్షణలో పడవేస్తున్నాయి. సూటిగా సమాధానం చెప్పలేక పోతున్నారు.
విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, అధికారుల వద్ద మంచి సాన్నిహిత్యం పెంచుకొంటూ, వారెవ్వరూ రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై చర్య తీసుకోకుండా కాపాడుకొనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని బిజెపి నాయకులకన్నా ఆయనకే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వద్ద ఎక్కువ పలుకుబడి ఉన్నదనే ప్రచారం ఉంది.
అదే విధంగా రాష్ట్రంలోని పలువురు బిజెపి నాయకులు సహితం జగన్ పై పెదవి విప్పకుండా `మానేజ్’ చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతున్నది. జివిఎల్ నరసింహ రావు, సునీల్ దేవధర్ వంటి పలువురు బిజెపి నేతలను విజయసాయిరెడ్డి ప్రభావితులను చేశారనే కధనాలు వెలువడుతున్నాయి.
అదే తరహాలో కన్నాను కూడా `వశపరచు’ కొనే ప్రయత్నం చేసి విఫలమైన్నట్లున్నది. అందుకనే ఇప్పుడు కన్నాపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పైనా కన్నా చంద్రబాబుకు అమ్ముడు పోయి, పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడుతున్నారని అంటూ కూడా ఆరోపించారు.
చంద్రబాబుకు రూ.20 కోట్లకు కన్నా అమ్ముడుపోయారు. వారిద్దరికీ మధ్య బ్రోకర్ సుజనా చౌదరే అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. కన్నా లేవనెత్తే విమర్శలకు సమాధానాలు చెప్పలేక, నిస్పృహతో ఇటువంటి ఆరోపణలను విజయసాయిరెడ్డి దిగుతున్నారని కొందరు వైసిపి నేతలు సహితం భావిస్తున్నారు.