కరోనా, బ్లాక్ ఫంగస్ లు ఏపీని నిద్రలేకుండా చేస్తున్నాయి. కేసులతో పాటు మరణాలు అధికంగా ఉండడంతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో బడ్జెట్ ఆమోదించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సుధీర్ఘంగా సమావేశాలు నిర్వహించే సమయం లేనందున ఒక్కరోజున బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించి ముగించేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ మాత్రం దీనిని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా విజృంభించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పేర్కొంటున్న అధికారులు తమ ప్రాణాలకు తెగించి సేవలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం కూడా చేదోడు వాదోడు అందించాల్సిన పరిస్థితి. అయితే టీడీపీ నాయకులు అసెంబ్లీ సమావేశాన్ని ఒక్కరోజుకే పరిమితం చేయడంపై విమర్శలు సాగిస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ సభ్యులందరినీ హాల్లోకి పిలిచి సమావేశం నిర్వహించే పరిస్థితి లేదు. అందుకే కనీస సభ్యులతో బడ్జెట్ ను ఆమోదించాలని ఈ ఒక్కరోజు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాత్రం బడ్జెట్ పై చర్చ జరగాల్సిందేనంటునంటున్నారు. రూ.2.11 లక్షల కోట్లతో ఉన్న బడ్జెట్ ను తూతూ మంత్రంగా ఎలా ఆమోదిస్తారని అంటున్నారు.
చర్చలకు అవకాశం లేని ఈ సమావేశాలకు రాలేమంటూ టీడీపీ బైకాట్ చేసింది. కానీ అఖిలపక్షం నిర్వహించాలంటోంది. అయితే ఇదంతా చంద్రబాబునాయుడు హైదరాబాద్ ను విడిచి రాలేకపోవడానికే అని విమర్శిస్తున్నారు. కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తే తమకేదో అవుతుందనే భయం చంద్రబాబు అండ్ టీంలో ఉందని అంటున్నారు. అందుకే డైరెక్టుగా చెప్పలేక సమావేశాలను బహిష్కరిస్తున్నామంటూ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని అంటున్నారు.