
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మద్యం వ్యాపారులు, వారికి సహకరించిన వారూ అరెస్టు అయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ అధికారులు, చార్జిషీట్లలో ఇప్పటి వరకూ 15 మంది పేర్లను పేర్కొంటే.. వారిలో మెజారిటీ నిందితులూ అరెస్ట్ అయ్యారు తాజాగా, మద్యం స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను అరెస్టు చేశారు. మనీష్ పేరు చార్జిషీట్లలో ఎక్కడా లేకపోవడం..అయినా.. విచారణ పేరిట పిలిచిన సీబీఐ.. తమకు సహకరించడం లేదంటూ అరెస్టు చేసింది. మరి, కేంద్ర దర్యాప్తు సంస్థల తదుపరి టార్గెట్ ఎవరు? ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న ఇది. అయితే, ఎవరిపై చార్జిషీటు దాఖలు చేసినా అందులో తప్పనిసరిగా సౌత్ గ్రూప్ తరఫున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో, వాటి తదుపరి టార్గెట్ ఆమెనా? అంటే ఇందుకు ఔననే అంటున్నాయి దర్యాప్తు వర్గాలు.
అభిషేక్ అరెస్టు తర్వాత..
లిక్కర్ స్కాం లో రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేశారు. ఆయనకు, కవిత కుటుంబంతో బంధుత్వం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌కే చెందిన, రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్ర పిళ్ళయిని అరెస్టు చేశారు. సమీర్ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఆయన ద్వారానే కవిత పెట్టుబడులు పెట్టారంటూ చార్జిషీట్‌లోనూ పేర్కొన్నారు. కవిత వద్ద గతంలో ఆడిటర్‌గా పని చేసిన బుచ్చిబాబును ఇటీవలే అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాలకే చెందిన అరబిందో ఫార్మా కంపెనీ ఎండీ శరత్‌చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, ముత్తా గౌతమ్ తదితరులనూ అరెస్టు చేశారు. ఆ సందర్భంగా దాఖలు చేసిన చార్జిషీట్లలోనూ కవిత పేరును ప్రస్తావించారు. మాగుంట రాఘవరెడ్డితో కలిసి కవిత ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసినట్లు ఈడీ పేర్కొంది. శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి, కవిత, శరత్‌చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్ల ముడుపులను ఆప్ నేతల తరఫున విజయ్ నాయర్ స్వీకరించారని తెలిపింది. ఈ గ్రూపునకు అభిషేక్ బోయిన్‌పల్లి, అరుణ్ రామచంద్ర, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారని వివరించింది. రాజకీయ నాయకులు తమ పేర్లను గోప్యంగా ఉంచేందుకు బినామీలను ప్రయోగించారని స్పష్టం చేసింది. సౌత్ గ్రూప్ సహా వీరందరినీ ఇప్పటికే సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయి. తాజాగా, చార్జిషీట్లలో ఎక్కడా పేరు లేని సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఇది ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కవిత.. చర్చనీయాంశం
వరుస అరెస్టుల నేపథ్యంలో కవిత అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసులో సాక్షిగా కవితకు 160 సీఆర్‌పీసీ కింద గత డిసెంబరులో సీబీఐ అధికారులు నోటీసులిచ్చి.. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలోనే 7 గంటలకుపైగా విచారించారు. అవసరమైతే మరోసారి విచారిస్తామని అప్పట్లోనే చెప్పారు. కానీ, ఇప్పటి వరకు కవితను మళ్లీ ప్రశ్నించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే మరోసారి నోటీసులిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి నేరుగా ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించనున్నట్లు వివరించాయి. గతంలో ఆమె ఇచ్చిన సమాచారం, అంతకుముందు, ఆ తర్వాత అరెస్టు చేసిన వారు ఇచ్చిన వివరాలు, దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించనున్నట్లు తెలిపాయి. విచారణ అనంతరం సీబీఐ అధికారులు అవసరమైతే కవితను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని వివరిస్తున్నాయి.