Chandrababu Meets Modi: తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచిరోజులస్తున్నాయి..!! గత మూడేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వ్యూహం రచిస్తోంది. బెట్టు..పట్టుతో ఉన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. కాస్త మెట్టు దిగినట్లు కనిపిస్తోంది. ఇక నుంచి వైరం వద్దు.. లైక్యం ముద్దు.. అన్న దిశగా పయనిస్తున్నారు. మొన్నటి వరకు మోదీ అంటే చికాకు పడిన బాబు ఇప్పుడు ఆయనతో కలిసి ఆప్యాయంగా కనిపించారు.. కాసేపు సాధక బాధకాలు చెప్పుకున్నారు.. దీంతో దాదాపు నాలుగేళ్లుగా దూరంగా ఉన్న బీజేపీ, టీడీపీ మళ్లీ ఒక్కటయ్యాయని తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో ఏపీలో మరోసారి రాజకీయ వేడి సంతరించుకుంది. అసలు చంద్రబాబు, మోదీ కలవడం వెనక వ్యూహం ఏంటి..? ఆయన ఎవరిని టార్గెట్ చేశారు..? ముందు ముందు ఏం చేయబోతున్నారు..?
విభజిత ఆంధ్రప్రదేశ్ గా మారిన తరువాత 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అంతకుముందు బీజేపీతో దోస్తీ కట్టి పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించారు. ఇవి ఉపయోగపడి అధికారంలోకి రావడానికి మార్గం ఏర్పడింది. అయితే 2019 ఎన్నికల సమయం నాటికి బీజేపీతో బాబు దూరంగా ఉంటూ వచ్చారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న కారణంతో మోదీతో వైరం పెంచుకున్నారు. ఈ పరిస్థితిని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ క్యాష్ చేసుకుంది. బాబు దూరం పెట్టిన మోదీని వైసీపీ నేత జగన్ వెళ్లి కలిశారు. 2019లో అధికారంలోకి వచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీని ఎవరూ పట్టించుకోలేదు. అప్పటి వరకు కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో పేరున్న బాబు ఏ జాతీయ పార్టీతో కలవకుండా రాష్ట్రంలోనే ఉండిపోయారు.
Also Read: PM Modi- Chandrababu: చంద్రబాబుపై మోడీ ప్రేమ పొంగిపాయే.. పచ్చ మీడియా కళ్లు చల్లబడే.!
అయితే ఈ మూడేళ్ల కాలంలో వైసీపీపై పోరుబాట సాగించారు. కానీ వైసీపీ మాత్రం బీజేపీకి దగ్గరగా ఉంటూ వచ్చింది. కేంద్రం అండతో రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు మెల్లగా టీడీపీని మరిచిపోయేలా వైసీపీ కొత్త కొత్త వ్యూహం రచిస్తోంది. దీంతో టీడీపీ నేత చంద్రబాబుు రూట్ మార్చారు. బీజేపీతో కయ్యం పెట్టుకునే నష్టమే తప్ప లాభం లేదని భావించారు. ఇందులో భాగంగా ఆయన మొన్నటి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కోరకపోయినా మద్దతు ఇచ్చారు. దీంతో ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ’ కార్యక్రమానికి బీజేపీ నుంచి చంద్రబాబును ఆహ్వానం వచ్చింది.
మొన్నటి వరకు చంద్రబాబును మోదీ దూరం పెట్టారని ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు వీరిద్దరు కలిసిపోయారని శనివారం నాడు విడుదలయిన ఫొటోలను చూస్తే తెలుస్తోంది. చంద్రబాబును మోదీ ఆప్యాయంగా పలకరించారు. అప్పుడప్పుడు ఢిల్లీకి వస్తూ ఉండాలని చెప్పారు. ఇకనుండి వస్తానని చంద్రబాబు రిప్లై ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మోదీ, చంద్రబాబు కలిసిపోయినట్లు క్లారిటీ వచ్చింది. ప్రధానమంత్రి మోదీనే కాకుండా బాబు సీపీఎం నాయకుడు సీతారం ఏచూరి, రజనీ కాంత్ తదితర ప్రముఖులతో కలిసి ఫొటోలు దిగారు.
గతంతో జాతీయ నేతలను కలవడానికి ఇష్టపడని బాబు ఇప్పుడు నేషనల్ వైడ్ గా తన పరపతిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పార్టీ నాయకుల అండ ఉంటే వచ్చే ఎన్నికల్లో లాభిస్తుందని అనుకుంటున్నారు. గతంలో ఇదే సమయంలో వైసీపీ ఇదే చేసి అధికారంలోకి వచ్చింది. వైరం పెట్టుకునే బాబుకు లౌక్యం కూడా తెలుసు. దీంతో ఆయన ఎవరెవరికి కలవాలో వారిని కలిసేస్తున్నారు. చంద్రబాబు ఇలా మోదీ కలవడం టీడీపీ నాయకుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంది.
కానీ వైసీపీ నాయకులకు మాత్రం షాక్ ఇచ్చినట్లయింది. ఇన్నాళ్లు బీజేపీ మా పార్టీ అనుకున్న వైసీపీ నాయకులు చంద్రబాబు మోదీతో కలవడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మోదీతో కలిసి మళ్లీ ఏం స్కెచ్ వేస్తున్నాడోనని టెన్షన్ పడుతున్నారు. మోదీతో పెట్టుకునే వాళ్లు అధికారంలోకి రారనే ఓ భావన ఉంది. ఆ విషయాన్ని చంద్రబాబు చాలా ఆలస్యమైనా తెలుసుకున్నారు. అయితే మొన్నటి వరకు మోదీతో కలిసి చిరునవ్వులు చిందించిన జగన్ ఇప్పుడు ఆయన ఎలా ఫీలవుతాడోనని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.