https://oktelugu.com/

BJP Politics: నాడు అద్వానీ.. నేడు వెంకయ్యనాయుడు.. బీజేపీలో సీనియర్లకు అథోగతేనా?

BJP Politics: దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి కుర్చీకి త్వరలో ఎన్నిక జరుగబోతోంది. ఈ ఎన్నిక బరిలో నిలబడేందుకు ఎన్డీయే కూటమి తరుపున ద్రౌపతి ముర్ము పేరును ఖరారు చేశారు. గత ఎన్నికలో దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేయగా.. ఈసారి గిరిజన మహిళకు అవకాశం ఇచ్చారు. సామాజిక పరంగా బీజేపీ నిర్ణయం సరైనదేనని అంటున్నారు. అయితే పార్టీని అంటిపెట్టుకొని.. ఎంతో కాలంగా సేవ చేస్తున్నవారు ఎందరో ఉన్నారు.  వారికి కావాల్సిన […]

Written By: , Updated On : June 22, 2022 / 11:13 AM IST
Follow us on

BJP Politics: దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి కుర్చీకి త్వరలో ఎన్నిక జరుగబోతోంది. ఈ ఎన్నిక బరిలో నిలబడేందుకు ఎన్డీయే కూటమి తరుపున ద్రౌపతి ముర్ము పేరును ఖరారు చేశారు. గత ఎన్నికలో దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేయగా.. ఈసారి గిరిజన మహిళకు అవకాశం ఇచ్చారు. సామాజిక పరంగా బీజేపీ నిర్ణయం సరైనదేనని అంటున్నారు. అయితే పార్టీని అంటిపెట్టుకొని.. ఎంతో కాలంగా సేవ చేస్తున్నవారు ఎందరో ఉన్నారు.  వారికి కావాల్సిన పదవులు మోదీ, షాలు దక్కకుండా చేస్తున్నారని ఆ పార్టీలోనే ఆవేదన వ్యక్తమవుతోంది.  గతంలో ఆర్ఎస్ఎస్ అధినేతగా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఎల్.కె. అద్వానీ.. బీజేపీని ఒంటిచేత్తో నడించారు. వాజ్ పేయి తర్వాత పార్టీకి పెద్దదిక్కుగా మారి బీజేపీని నిలబెట్టారు. ఆయన తర్వాత పార్టీలో చురుకైన వ్యక్తిగా ఉన్న వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతిని చేసి ఉత్సవ విగ్రహంగా మార్చేశారన్న అపవాదు ఉంది. వారు తమ కోరికలు నెరవేరకుండానే రిటర్మైంట్  తీసుకుంటారా..? అనే చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినా.. వారు అనుకున్న పదవులను అనుభవించకుండానే పార్టీ నుంచి తప్పిస్తున్నారా? అన్న ఆవేదన నెలకొంది.

రాజకీయ కురవృద్ధుడు ఎల్.కె. అద్వానీది బీజేపీలో ప్రత్యేకమైన జీవితం. హిందూవాదంతో దేశంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు.. అనేక అవమానాలు భరించారు. కానీ పార్టీని వీడకుండా కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లారు. అయితే పార్టీ కోసం ఎంతో కష్టపడినా ఆయన చిరకాల వాంఛ ప్రధాని అవడం. లేకపోతే రాష్ట్రపతిగా కావడం.. కానీ ఈ కోరికలు తీరలేదు. ఎన్నో అడ్డుంకుల మధ్య ఉప ప్రధాని మాత్రమే కాగలిగారు. ఆ తరువాత కొన్నాళ్లు బీజేపీ అధికారంలో లేకపోవడంతో అది సాధ్యం కాలేదు. ఇక మోదీ, షాల ద్వయంలో మరోసారి ప్రభంజనం సృష్టించిన బీజేపీలోనైనా రాష్ట్రపతిగా అవకాశం వస్తుందని ఆశపడ్డారు. కానీ మోదీ ద్వయం ఆ ఛాన్స్ ఇవ్వలేదు. పార్టీ సీనియర్ నాయకుడిగా మాత్రమే గౌరవం ఇచ్చి సర్ది చెప్పారు.

ఇప్పుడు దక్షిణాదికి చెందిన వెంకయ్యనాయుడిది అదే పరిస్థితి. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో చురుగ్గా పనిచేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు. ఒక దశలో దక్షిణాదిలో వెంకయ్యనాయుడిలా ఎవరూ పనిచేయలేరని అంటుంటారు. అలాంటి సమయంలో ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి ఆయన దూకుడుకు కళ్లెం వేశారు. ఆయినా సర్దుకొని మరోసారి రాష్ట్రపతి పదవి కోసం అవకాశం ఇస్తారని వేచి చూశారు. కానీ ఇప్పుడు ద్రౌపది ముర్మను ఎంపిక చేయడంతో వెంకయ్యనాయుడి ఆశలు గల్లంతయ్యాయి. దీంతో ఇక వెంకయ్యనాయుడికి అంతకుమించిన పదవి ఇచ్చే అవకాశం లేదని తేలిపోయింది. దీంతో ఆయన కోరిక తీరకుండానే రిటైర్మెంట్ తీసుకుంటారా..? అనే చర్చ సాగుతోంది.

దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి కుర్చీనే. కీలక సమయాల్లో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పార్టీ తరుపున కాకుండా దేశంలో జరిగే పరిస్థితులను అంచనా వేయాల్సి ఉంటుంది. ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి. సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచ దేశాల్లో భారత రాష్ట్రపతికి అమితంగా గౌరవం ఇస్తారు. అలాంటి పదవి కోసం రాజకీయ ఉద్ధండులను నియమిస్తారు. అయితే గతంలో రామ్ నాథ్ కోవింద్ , ఇప్పుడు ద్రౌపది ముర్ములకు అవకాశం ఇవ్వడం ద్వారా సామాజికంగా న్యాయం చేశారని అంటున్నారు. కానీ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోదీ, షాలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తులకే ప్రాధాన్యం ఇస్తారని అనుకున్నారు. కానీ అందులో పూర్తిస్థాయిలో ఉన్నవారికి కూడా న్యాయం చేయలేకపోతున్నారని అంటున్నారు. కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు ఎన్నో కార్యక్రమాలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో చురుగ్గా పనిచేశారు. కాంగ్రెస్ హయాంలోనూ బీజేపీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లగలిగారు. కానీ ఆయనకు అత్యున్నత పదవి ఇచ్చి సత్కరిస్తారని అనుకున్నారు. కానీ ఇవ్వలేదు. వెంకయ్యనాయుడు నిరాశగానే రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? అని  పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు.

రాష్ట్రపతి అభ్యర్థి కోసం బీజేపీ  సుదీర్ఘంగా చర్చలు జరిపింది.  రాష్ట్రపతి ఎన్నిక కోసం   ఎన్డీయే కూటమి  దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఏపీ, తమిళనాడులోని వైసీపీ, అన్నాడీఎంకేల సపోర్టు తీసుకోనుంది. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడును బరిలో దింపితే మిగతా పార్టీలు కూడా మద్దతుగా వచ్చే అవకాశం ఉండేదని అనుకుంటున్నారు. అసలే దక్షిణాదికి చెందిన నేతలకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ లాంటి నాయకులు పోరాటం మొదలు పెట్టారు. ఈ సమయంలో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ బీజేపీ ఉత్తరాది వారికే అవకాశం ఇవ్వడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కేడర్లో అసంతృప్తి నింపినట్లైంది.