
ఏపీ అంతా ఒక ఎత్తు.. తిరుమలలో మాత్రం మరో ఎత్తు అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి కరోనాను మోసుకొచ్చే భక్తుల వల్ల తిరుమలలో మరిన్ని కేసులు పెరిగే ప్రమాదం ఉంది. అయినా కూడా తిరుమల దర్శనాల విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు కొని తెచ్చుకుంది. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజుకు 18 గంటలు పాక్షిక లాక్డౌన్ ను ఏపీలో విధించింది. దీన్ని కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ, తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో మాత్రం విస్మరిస్తోంది. తిరుమల కొండలపై వెంకటేశ్వర దర్శనానికి యాత్రికులను అనుమతిస్తున్నారు.
యాత్రికుల కోసం టిటిడి “సర్వ దర్శనం” (ఉచిత దర్శనం) ను నిలిపివేసినప్పటికీ గత కొన్ని వారాలుగా 300 రూపాయలకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనే యాత్రికులకు దర్శనం కల్పిస్తోంది. తిరుపతితో సహా రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ -19 కేసుల సంఖ్య బాగా పెరుగుతున్న వేళ ఈ భక్తుల రాక మరిన్ని సమస్యలు కొని తెచ్చుపెడుతోంది.. జగన్ ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ విధించి బస్సు సేవలను నిలిపివేసిన తరువాత కూడా టిటిడి యాత్రికులకు ప్రత్యేక దర్శనాలను అనుమతించడం కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కోవిడ్ -19 కేసులు పెరగడం, లాక్డౌన్ ఆంక్షలు కారణంగా ఆలయాల దర్శనం కూడా రద్దు చేశారు. రాష్ట్రంలోని మిగతా ప్రధాన దేవాలయాలన్నీ మూసివేయబడినప్పటికీ తిరుమలలో మాత్రం అనుమతిస్తున్నారు. ఈ దేవాలయంలో రోజువారీ కర్మలు జరుగుతున్నాయి. అయితే, ప్రత్యేక దర్శనం కోసం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న తిరుపతి యాత్రికులు ఈ దశలో దేవాలయాలను సందర్శించడం ప్రమాదకరమని గ్రహించినట్లు తెలుస్తోంది. కాబట్టి, తిరుమల సందర్శనకు తమ ప్రణాళికలను స్వచ్ఛందంగా వారే వాయిదా వేశారు. ఫలితంగా, బుధవారం వెంకటేశ్వర ఆలయం తిరుమల చరిత్రలో అత్యల్ప మంది హాజరై దర్శించుకున్నారు. కేవలం 2,262 మంది యాత్రికులు మాత్రమే తిరుమల ఆలయాన్ని సందర్శించారు. హుండీ వసూలు అత్యల్పంగా రూ .11 లక్షలు. కళ్యాణ కట్ట వద్ద 962 మంది యాత్రికులు మాత్రమే తమ జుట్టును సమర్పించారు.
దీంతో ఇక టీటీడీ సైతం దర్శనం ఆపేసి ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 11 – మే 31 మధ్య తమ ప్రత్యేక దర్శన టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు తమ దర్శన తేదీని తరువాతి తేదీలో మార్చుకోవచ్చని తెలిపింది.