Telangana Congress: కాంగ్రెస్ ఈ పేరు వింటేనే కలహాలు.., కయ్యాలు.., కూటములు.., కుంపట్లు గుర్తొస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి తర్వాత ఆ పార్టీలో అంతటి చరిష్మా, పార్టీపై పట్టు ఉన్న నాయకుడు కరువయ్యాడు. దీంతో 2014 తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణలో కాస్తో కూస్తో పార్టీ ఉనికిలో ఉన్నా.. ఏపీలో దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి. ఇక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటున్న కాంగ్రెస్ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణలోనూ ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే వారు లేక క్యాడర్‌లో జోష్ కనిపించడం లేదు.
కంచుకోటలో కనుమరుగయ్యే పరిస్థితి..
కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు కంచుకోట. 2004, 2009లో జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 10 కాంగ్రెస్ గెలుచుకుంది. కానీ 2014, 2018 ఎన్నికల్లో తర్వాత కేవలం ఒకే స్థానానికి పరిమితమైంది. జిల్లా వ్యాప్తంగా ప్రజాభిమానం ఉన్న నేతలకు కొదవ లేదు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వంటి పలువురు నేతలను ఉమ్మడి జిల్లాలోని ఏమారుమూల గ్రామానికి వెళ్లిన గుర్తుపట్టే అవకాశం ఉంది. వీరు ఒక్కప్పుడు పార్టీ టికెట్ల విషయం నుంచి గెలుపు వరకు బాధ్యత తీసుకొని సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాలుగు జిల్లాలుగా విడిపోవడంతో ప్రస్తుతం ముఖ్య నేతలు ఎవరి జిల్లాకు వారు పరిమితం అయ్యారు.
నియోజకవర్గం దాటని శ్రీధర్‌బాబు..
ఉమ్మడి జిల్లాలో ఎక్కడికి వెళ్లిన గుర్తించే నేతల్లో మాజీ మంత్రి, ప్రస్తుత మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌ను శాసించిన నేతగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం మంథని నియోజకవర్గం కొంతభాగం పెద్దపల్లి జిల్లాలో మరి కొంత భాగం జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉండటంతో శ్రీధర్‌బాబు తన నియోజకవర్గ పరిధిలో మాత్రమే పర్యటిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీకి కొంత ఓటింగ్ పెరిగే అవకాశం ఉంది..
జగిత్యాల దాటని జీవన్‌రెడ్డి..
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాజీ మంత్రిగా జిల్లాకు చెందిన అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎం.సత్యనారాయణరావు, జూవ్వాడి రత్నకర్‌రావు, శ్రీపాదరావు, వెంకటస్వామి వంటి వారితో కలిసి పని చేసిన అనుభవంతోపాటు ఉమ్మడి జిల్లాపై పూర్తి స్థాయి పట్టు ఉంది. ప్రస్తుతం జీవన్‌రెడ్డి జగిత్యాల జిల్లాకు మాత్రమే పరిమితం అయిన నేపథ్యంలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలపైన మాత్రమే దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల సమయంలో జగిత్యాల జిల్లాతోపాటు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మంచి ఫలితాలు వస్తాయని విశ్లేష కులు అంటున్నారు.
గంగరగోలంలో పొన్నం ప్రభాకర్..
ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇటీవలికాలం వరకు పార్టీ కార్యక్రమాల్లో అంటి ముట్టనట్లుగా వ్యవరించారు. ప్రస్తుతం హుస్నాబాద్ టికెట్‌పై దృష్టిసారించారు. ఉద్యమ కాలంలో పొన్నం పార్లమెంట్ లోపల బయట తెలంగాణకు అనుకులంగా ఉద్యమించిన తీరుతో ఉమ్మడి జిల్లా ప్రజలకు సుపరిచితుడు.. ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ పార్టీలో ప్రాధాన్యం లేక ఒక్క నియోజక వర్గానికి మాత్రమే పరిమితం కావడం కాంగ్రెస్ పార్టీకి నష్టంగానే భావిస్తున్నారు.
ఎన్నికల సమయంలో గుర్తింపున్న లీడర్లేరీ?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను నడిపించే నాయకుడు లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నేతలు ఎవరి నియోజకవర్గంలో వారే పాట్లు పడుతున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, హుజూరాబాద్, రామగుండం, చొప్పదండి, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే క్లిష్ట సమయంలో ఉమ్మడి జిల్లాలో పేరున్న లీడర్ల నాలుగు సార్లు నియోజకవర్గాలకు వచ్చిపోతే కాస్త ఓటింగ్ శాతం పెరగడంతోపాటు పార్టీలో నేతల మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలు తొలిపోయేవని క్యాడర్ భావిస్తోంది.