బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో.. 100 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు సార్లు దేశంలో చిత్తుగా ఓడిపోయింది. ఒకప్పుడు 1 ఎంపీ సీటు మాత్రమే గెలిచిన బీజేపీ వరుసగా రెండు సార్లు దేశంలో పొత్తు లేకుండా సొంతంగా మెజారిటీ సాధించింది. సంకీర్ణ రాజకీయాలు ఏలే భారతదేశంలో ఎవరి సపోర్టు లేకుండా బీజేపీ ఠీవీగా పాలిస్తోంది. ఇదో అద్భుతమనే చెప్పాలి.
ఎన్నికల వేళ బీజేపీతో కటీఫ్ చేసుకొని కాంగ్రెస్ తో జతకూడిన ఏపీలోని తెలుగు దేశం పార్టీ మూల్యం చెల్లించుకుంది. కాంగ్రెస్ గతే టీడీపీకి పట్టింది. అక్కడ కాంగ్రెస్, ఇక్కడ టీడీపీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. తెలంగాణలోనూ కాంగ్రెస్-టీడీపీ పొత్తు ఓ విఫల ప్రయోగంగా నిలిచిపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 52 సీట్లు మాత్రమే దక్కించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది.ఇక ఏపీలో మాత్రం చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు బోటాబోటీగా టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ రెండూ అవసాన దశలో ఉన్నాయి.
వారసత్వ రాజకీయాలతో కాంగ్రెస్ పని అయిపోయింది. సోనియా వృద్ధాప్యంతో పార్టీలో చురుకుగా ఉండలేకపోతున్నారు. రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టడం లేదు. ఇక ఇక్కడ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు 70 ఏళ్లు దాటాయి. ఆయన ఇంకో నాలుగేళ్లు ప్రతిపక్షంలో ఉండాలి. వృద్ధాప్యం చంద్రబాబును అంత యాక్టివ్ గా ఉంచలేదు. ఇక బాబు కు స్టాండ్ బైగా లోకేష్ ఎదగడం లేదు. ఇటు తెలంగాణలో ఇప్పటికే టీడీపీ పని అయిపోయింది. ఆ పార్టీ నుంచి అందరూ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో తెలంగాణలో టీడీపీ తుడుచుపెట్టుకుపోయింది.
నిజానికి అక్కడ కాంగ్రెస్ లో సోనియా-రాహుల్, ఇక్కడ టీడీపీలో చంద్రబాబు-లోకేష్ లకే పార్టీ పగ్గాలు పోతున్నాయి. తప్పితే వేరొకరిని ఈ చట్రంలోకి రానీయడం లేదు. ఎదగనీయడం లేదు. 1995లో టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు ఇప్పటికీ మరొకరికి అది ఇవ్వలేదు. లోకేష్ ను సైతం అధ్యక్షుడిని చేయకపోవడం విశేషం. సోనియా, చంద్రబాబులు రాజకీయాల్లో నిరూపించుకున్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలారు. అయితే వారి వారసులే ఫ్లాప్ అయ్యారు. అక్కడ రాహుల్, ఇక్కడ లోకేష్ లు పార్టీని నడిపించే శక్తి తమకు లేదని నిరూపించుకున్నారు.
అయితే రాహుల్ కు ప్రత్యామ్మయంగా బలమైన ప్రియాంక గాంధీ ఉన్నారు. కానీ ఇక్కడ లోకేష్ కు ప్రత్యామ్మాయంగా ఎన్టీఆర్ ను తేవడానికి చంద్రబాబు అస్సలు ఒప్పుకోరు. బహుశా బ్రహ్మణి తెరమీదకు రావచ్చు. మొత్తానికి ఈ రెండు పార్టీలు ఇప్పుడు నాయకత్వ లోపంతో పార్టీలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోనియా, చంద్రబాబులు వైదొలిగితే టీడీపీ, కాంగ్రెస్ కథ కంచికేనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.