Nadendla Manohar: తెనాలి నాదెండ్ల మనోహర్ కే.. ఆలపాటిని అలా సర్దుబాటు చేసిన చంద్రబాబు

పొత్తు కుదిరిన తర్వాత రెండు పార్టీల మధ్య ఆత్మీయ సమావేశాలు జరిగాయి. తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన సమావేశంలో నాదెండ్ల మనోహర్ తో పాటు ఆలపాటి రాజా పాల్గొన్నారు.

Written By: Dharma, Updated On : January 11, 2024 3:03 pm

Nadendla Manohar

Follow us on

Nadendla Manohar: తెనాలిలో నాదెండ్ల మనోహర్ కు లైన్ క్లియర్ అయినట్టేనా? ఆలపాటి రాజా బరి నుంచి తప్పుకున్నట్టేనా? ఆ మేరకు చంద్రబాబు ఆయనకు ప్రత్యామ్నాయం చూశారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కసరత్తు జరుగుతోంది. అయితే అందరి దృష్టి తెనాలిపై పడింది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గం కావడమే విశేషం. అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన.. అసెంబ్లీ స్పీకర్ గా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన ఈసారి తెనాలి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే టిడిపి నేత ఆలపాటి రాజా కూడా ఉండడంతో సస్పెన్స్ నెలకొంది.

పొత్తు కుదిరిన తర్వాత రెండు పార్టీల మధ్య ఆత్మీయ సమావేశాలు జరిగాయి. తెనాలి నియోజకవర్గానికి సంబంధించిన సమావేశంలో నాదెండ్ల మనోహర్ తో పాటు ఆలపాటి రాజా పాల్గొన్నారు. ఇద్దరు నేతలు సఖ్యతగా మెలిగారు. పొత్తులో భాగంగా నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటామని చెప్పుకొచ్చారు. రెండు పార్టీల శ్రేణులు సైతం సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఈ తరుణంలో అక్కడ ఎలా నడుచుకోవాలని చంద్రబాబు, పవన్ లు తర్జనభర్జన పడుతూ వచ్చారు. కానీ సమస్యకు పరిష్కార మార్గం చూపుతూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెనాలి నియోజకవర్గంలో నుంచి ఆలపాటి రాజాను తప్పించడానికి చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం.

నాదెండ్ల మనోహర్ జనసేనలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. పవన్ తర్వాత ఆ పార్టీ వ్యవహారాలను ఆయనే చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో చొరవ చూపింది కూడా ఆయనే. దీంతో నాదేండ్ల మనోహర్ విషయంలో చంద్రబాబు సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారు. పైగా తెనాలి సీటు విషయంలో పవన్ సైతం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో తెనాలిని జనసేనకు విడిచి పెట్టాల్సిన అనివార్య పరిస్థితి చంద్రబాబుకు ఎదురైంది. తనకు అత్యంత నమ్మకస్తుడైన ఆలపాటి రాజాకు చంద్రబాబు ఒప్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అందుకు రాజా సైతం మెత్తబడ్డారని తెలుస్తోంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజాకు ఒక మంచి అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

గుంటూరు సిట్టింగ్ ఎంపీగా గల్లా జయదేవ్ ఉన్నారు. ఈసారి ఆయన పోటీ చేయడం అనుమానమే. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చంద్రబాబుకు గల్లా జయదేవ్ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో బలమైన అభ్యర్థిని గుంటూరు నుంచి బరిలో దించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఆలపాటి రాజాను పోటీ చేయించడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. పైగా గుంటూరు పార్లమెంట్ స్థానం పరిధిలోనే తెనాలి నియోజకవర్గం ఉంది. అందుకే ఎంపీగా పోటీ చేస్తే ఆ నియోజకవర్గంలో నుంచి గుంప గుత్తిగా అటు నాదెండ్ల మనోహర్ కు, ఇటు ఆలపాటి రాజాకు ఓట్లు పడే అవకాశం ఉంది. అయితే తెనాలిని విడిచి పెట్టేందుకు ఆలపాటి రాజాకు ఇష్టం లేకున్నా.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. పైగా క్షేత్రస్థాయిలో గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం లో టిడిపికి బలం ఉంది. గెలుపొందే సీట్లలో గుంటూరు ఒకటి అని ఖాయంగా తేలింది. అందుకే అక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆలపాటి రాజా దాదాపు సిద్ధమైనట్లు సమాచారం.