Homeఆంధ్రప్రదేశ్‌ఈసీ ఆదేశాలను జగన్ ప్రభుత్వం పాటిస్తుందా!

ఈసీ ఆదేశాలను జగన్ ప్రభుత్వం పాటిస్తుందా!

కరోనా వైరస్ కారణం చూపి ఒక వంక స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ వాయిదా వేయడంతో తీవ్ర అసహనం, ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ .జగన్మోహన్‌రెడ్డి వ్యక్తం చేస్తూ ఉండడంతో కమీషన్ ఆదేశాలను ప్రభుత్వం ఏమేరకు పాటిస్తుందనే అంశం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నది. 
 
ఒక వంక కమీషన్ ఆదేశాలను సుప్రీం కోర్ట్ లో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవంక వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ కమీషన్ కు లేఖ వ్రాసారు. 
 
ఇలా ఉండగా, రెండు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రెండు సబ్‌డివిజన్ల డీఎస్పీలు, నలుగురు సీఐలపై వేటుకు కమీషన్ సిఫారసు చేయడం ఇప్పటికి అధికార వర్గాలలో దిగ్బ్రాంతి కలిగిస్తున్నది. తాము అధికార పక్షం, కమీషన్ ల మధ్య నలిగిపోతున్నామనే అభిప్రాయం వారిలో వ్యక్తం అవుతున్నది. ఈ అధికారులపై చర్యలు తీసుకొనే అంశమై కమీషన్ ఆదేశాలను ప్రభుత్వం ఏ మేరకు అమలు పరుస్తుందని చర్చ జరుగుతున్నది. అమలు పరచని పక్షంలో రాజ్యాంగ సంక్షోభకార పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నది. 
 
సుప్రీం కోర్ట్ మరో విధంగా ఆదేశం ఇస్తే మినహా ఎన్నికలు ఆరు నెలలు వాయిదా పడడంతో కనీసం మరో రెండు నెలల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. దానితో ఎన్నికల విధులతో సంబంధం గల అధికారుల పనితీరుపై కమీషన్ దృష్టి ఉంటుందనే సంకేతం ఇప్పుడు వ్యక్తమయింది. మొన్నటి వరకు వలే అధికారపక్షపు ప్రయోజనాలకోసం ఏకపక్షంగా వ్యవహరించలేని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. 
 
పోలీస్, రెవిన్యూ యంత్రాంగం తమకు వ్యతిరేకంగా వ్యవహరించక పోయినా `ఏకపక్షంగా’  ఎన్నికలు జరిగేటట్లు సహకరించని పక్షంలో ఇబ్బందులు తప్పవనే జంకు ఇప్పటికే అధికార పక్ష నేతలలో వ్యక్తం అవుతున్నది. తమ ఆగడాలపై కమీషన్ జోక్యం చేసుకొని కేసుల నమోదు వరకు వెడితే భవిష్యత్లో సమస్యలు తలెత్తగలవని ఆందోళన చెందుతున్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెచ్చుమీరిన హింసను కట్టడి చేయాల్సిన పోలీసులు చాలాచోట్ల అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. హింసాత్మక ఘటనలు తీవ్రంగా పరిగణిస్తున్నామని, అన్నింటినీ పరిశీలిస్తామని ఈసీ చేసిన వ్యాఖ్యలు పోలీసుల్ని కలవారానికి గురిచేస్తున్నాయి. దానితో రాబోయే రెండు నెలల వరకు అధికార యంత్రాంగం ఇప్పటి వలే అధికార పక్షానికి పూర్తిగా సహకరించక పోవచ్చనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. 
Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular