రేవంత్ విష‌యంలో.. బీజేపీ మౌనం స‌రైందేనా?

తెలంగాణ‌ పీసీసీ చీఫ్ ఎంపిక‌పై ప్ర‌త్య‌ర్థులు కూడా దృష్టిసారించారు. ఎవ‌రికి ద‌క్కుతుంది? ఎవ‌రికి ద‌క్కితే మ‌న‌కు మేలు జ‌రుగుతుంద‌ని లెక్క‌లు వేసుకున్నారు. టీఆర్ఎస్ మాత్రం రేవంత్ ద‌క్క‌కూడ‌ద‌నే కోరుకుంద‌నే ప్ర‌చారం ఉంది. బీజేపీ మాత్రం ఎవ‌రికి ద‌క్కినా.. త‌మ‌కు పండగేన‌ని అనుకుందని అంటారు. కుంప‌ట్ల కూట‌మిగా మారిన కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ ఎంపిక‌ చిచ్చు రాజేయ‌డం ఖాయ‌మ‌ని, ఆ మంటలు కాంగ్రెస్ ను కాల్చేయ‌డం త‌ప్ప‌ద‌ని, దీంతో.. చాలా మంది సీనియ‌ర్లు త‌మ పార్టీలోకి వ‌స్తార‌ని […]

Written By: Bhaskar, Updated On : July 3, 2021 1:10 pm
Follow us on

తెలంగాణ‌ పీసీసీ చీఫ్ ఎంపిక‌పై ప్ర‌త్య‌ర్థులు కూడా దృష్టిసారించారు. ఎవ‌రికి ద‌క్కుతుంది? ఎవ‌రికి ద‌క్కితే మ‌న‌కు మేలు జ‌రుగుతుంద‌ని లెక్క‌లు వేసుకున్నారు. టీఆర్ఎస్ మాత్రం రేవంత్ ద‌క్క‌కూడ‌ద‌నే కోరుకుంద‌నే ప్ర‌చారం ఉంది. బీజేపీ మాత్రం ఎవ‌రికి ద‌క్కినా.. త‌మ‌కు పండగేన‌ని అనుకుందని అంటారు. కుంప‌ట్ల కూట‌మిగా మారిన కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ ఎంపిక‌ చిచ్చు రాజేయ‌డం ఖాయ‌మ‌ని, ఆ మంటలు కాంగ్రెస్ ను కాల్చేయ‌డం త‌ప్ప‌ద‌ని, దీంతో.. చాలా మంది సీనియ‌ర్లు త‌మ పార్టీలోకి వ‌స్తార‌ని ఆశ‌లు పెట్టుకుంద‌నే ప్ర‌చారం సాగింది.

అనుకున్న‌ట్టుగానే.. సీనియ‌ర్లంతా వ‌ద్దే వ‌ద్ద‌ని మొత్తుకున్న రేవంత్ కే పీఠం ద‌క్కింది. కానీ.. బీజేపీ ఆశించింది జ‌ర‌గ‌లేదు. సీనియ‌ర్లు పార్టీ మార‌డం సంగ‌తి అటుంచితే.. క‌నీసం ప‌ల్లెత్తు మాట కూడా అన‌లేదు. ఈ గ్యాప్ లోనే రాజ‌కీయం మొద‌లు పెట్టిన రేవంత్ రెడ్డి.. వ‌రుస‌గా సీనియ‌ర్ల‌ను క‌లుస్తూ వ‌స్తున్నారు. మొద‌ట జానారెడ్డిని, ఆ త‌ర్వాత వీహెచ్ ను అనంతరం ఇత‌ర నేత‌ల‌ను క‌లిశారు. ఆ విధంగా.. సానుకూల వాతావ‌ర‌ణాన్ని సృష్టించుకుంటున్నారు.

అంతేకాదు.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న టీఆర్ఎస్‌, బీజేపీపై విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెట్టారు. అయితే.. బీజేపీ నేత‌లు మాత్రం కౌంట‌ర్ ఇవ్వ‌లేదు. క‌మ‌లం నేత‌లు స్పందించ‌కుండా ఉండ‌డంలో వ్యూహం దాగి ఉంది. కౌంట‌ర్ ఇవ్వ‌డం ద్వారా.. అన‌వ‌స‌రం ప్ర‌యారిటీ పెంచిన‌వాళ్లం అవుతామ‌నే ఉద్దేశంతోనే.. మౌనంగా ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇది ఎంత వ‌ర‌కు స‌రైన నిర్ణ‌యం అనే చ‌ర్చ కూడా సాగుతోంది.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ ఎన్నికయ్యేంత వ‌ర‌కు తెలంగాణ‌లోని ఇత‌ర జిల్లాల్లో చాలా మందికి ఆయ‌న పేరు కూడా పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. అధ్యక్ష బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. దారుణ‌మైన‌ వ్యాఖ్య‌లు కూడా చేశారు. ఆ విధంగానే ఆయ‌న ఫేమ‌స్ అయ్యారు. కేసీఆర్ మాత్రం ఎన్న‌డూ ఆయ‌న గురించి స్పందించ లేదు.

ఇప్పుడు రేవంత్ సంగ‌తి తీసుకుంటే.. ఆయ‌న గ‌తంలోనే ఫేమ‌స్‌. పైగా ఫైర్ బ్రాండ్ అని పేరున్న నేత‌. ఆయ‌న‌కు పీసీసీ రావ‌డానికి ప్ర‌ధాన క్వాలిఫికేష‌న్ కూడా ఇదే. అలాంటి నేత‌కు కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోతే.. మౌనాన్ని ఆశ్ర‌యిస్తే.. తేడా కొట్టే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. ఇన్నాళ్లూ టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీ అని ప్ర‌చారం చేసుకున్నారు క‌మ‌ల‌నాథులు. ఇప్పుడు త‌న‌దైన దూకుడుతో టీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ గా మార్చే ఛాన్సు కూడా ఉందంటున్నారు. మ‌రి, దీనికి కాషాయ నేత‌లు ఏమంటారో?