Telangana BJP: తెలంగాణలో బిజెపికి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఆ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం కానుంది అని తేల్చి చెబుతున్నాయి. ఆరు నెలల కిందట దూకుడు మీద ఉన్న ఆ పార్టీకి ఈ స్థాయి ఫలితాలా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కనీసం గౌరవప్రదమైన సీట్లు కూడా దక్కే ఛాన్స్ కనిపించకపోవడంతో కాషాయ దళం అంతర్మధనం చెందుతోంది. తమది బలుపు కాదు.. వాపా? అని గుర్తు చేసుకుంటోంది. ఒకటి రెండు ఉప ఎన్నికల్లో విజయాన్ని చూసి అధికారంలోకి వచ్చేస్తాం అన్న భావన లోకి రావడం.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయలేకపోవడం మైనస్ గా మారిందని ఇప్పుడు విశ్లేషిస్తున్నారు.
ఆరు నెలల క్రితం వరకు భారతీయ జనతా పార్టీ మంచి దూకుడు మీద ఉంది. అధికార బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంది. అయితే ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఉంటే ఫలితం మరోలా ఉండేది. 2018 ఎన్నికల్లో ఒకే స్థానానికి పరిమితమైన పార్టీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను సొంతం చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అధికార బీఆర్ఎస్ ను ముచ్చెమటలు పట్టించింది. బండి సంజయ్ బలమైన నాయకుడిగా మారారు. బిజెపిని మరింత దూకుడుగా తీసుకెళ్లగలిగారు. కానీ ఆయన అకాల మార్పుతో పరిస్థితి చిన్నాభిన్నమైంది. ఈ విషయంలో కెసిఆర్ ఒత్తిడికి బిజెపి అగ్ర నాయకత్వం తలొగ్గిందన్న విపక్షాల విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. బిజెపి, బీఆర్ఎస్ ఒక్కటేనన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. బిజెపిని సైడ్ చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన తీరు తెలంగాణలో బిజెపిని దారుణంగా దెబ్బతీసింది. ఈ కేసులో సీఎం కేసీఆర్ తనయ కవితను అరెస్టు చేయకపోవడంతో ఒక రకమైన చేంజ్ కనిపించింది. బిజెపి పై ప్రజలు అనుమానపు చూపులు చూడడం ప్రారంభించారు. అదే సమయంలో కెసిఆర్ సర్కార్ పై ఎంతవరకు పైకి కనిపించని వ్యతిరేకత చాప కింద నీరులా ఉంటూ వచ్చింది. బీఆర్ఎస్, బిజెపి వేర్వేరు కాదనే ప్రచారాన్ని జనం బలంగా నమ్మారు. కెసిఆర్ ఆట బిజెపి కట్టిస్తుందని అనుకుంటే.. అందుకు విరుద్ధంగా మద్దతుగా నిలబడిందని ఆగ్రహం ప్రజల్లో పిల్లుబికింది.
బీఆర్ఎస్ అంతు చూసే పార్టీ బిజెపి అని నమ్మి వెళ్లిన నాయకులంతా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో బిజెపి తెలంగాణలో పక్కకు వెళ్లిపోయింది. బిజెపి చర్యల ఫలితం… కెసిఆర్ తో చేసుకున్న అంతర్గత ఒప్పందం.. రాష్ట్ర బిజెపిలో నాయకత్వ మార్పు.. ఇతర ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కాకపోవడం వంటి కారణాలతో బీజేపీ దారుణంగా ఫెయిల్ అయ్యింది. కాంగ్రెస్ వైపు పవనాలు బలంగా వీచేలా కేంద్ర పెద్దలు చేజేతులా కల్పించారన్న టాక్ నడుస్తోంది. మొత్తానికైతే తెలంగాణలో ప్రత్యామ్నాయం అవుతాం అనుకున్న కాషాయ పార్టీ.. కెసిఆర్ తో అంటగాకి భారీగా మూల్యం చెల్లించుకుందన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. రేపటి ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాదిరిగానే ఉంటే మాత్రం తెలంగాణ సమాజంలో బిజెపి చిన్నబోయినట్టే. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేనట్టే. రేపటి ఫలితాల్లో బిజెపి ఫెయిల్యూర్ పై మరింత క్లారిటీ రానుంది.