TDP : తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో మీడియా తీరు వేరు. అది జగమెరిగిన సత్యం. ఇక నీలి మీడియా గురించి చెప్పనక్కర్లేదు. అది వైసిపి ప్రయోజనాల కోసం పెట్టుకున్న సొంత మీడియా. వారు ఎలా ముందుకెళ్లినా పర్వాలేదు. కానీ నిజాయితీకి నిలువుటద్దమని చెప్పుకునే ఎల్లో మీడియా అధినేతలు మాత్రం నడుచుకునేది ఒకలా.. చెప్పుకునేది మరోలా ఉంటుంది.వీరికి చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యం. చంద్రబాబు అధికారంలోకి రావడం కీలకం. అప్పుడు నాలుగు రాళ్లు వెనుకేసుకోగలరు. దీనికోసమే వీరు ఆరాటపడుతుంటారు. దీంతో మీడియా విలువలకు తిలోదకాలు ఇచ్చి.. రోత రాతలతో ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.
అనంతపురం జిల్లా రాప్తాడు లో వైసిపి సిద్ధం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది. దాదాపు రాయలసీమ జిల్లాల నుంచి జనాలను సమీకరించింది. మూడు వేల ఆర్టీసీ బస్సు సర్వీసులను వినియోగించారు. అయితే 10 లక్షల మంది జనాభా హాజరయ్యారని వైసీపీ అనుకూల మీడియా చెబుతోంది. వారు చెబుతున్న సంఖ్య కాకపోయినా లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఆ నిజాన్ని కూడా ఒప్పుకునేందుకు ఎల్లో మీడియా వెనుకడుగు వేస్తోంది. తక్కువమంది వచ్చినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఇది మాత్రం వేగటు పుట్టిస్తుంది.
లక్షలాదిమంది తరలివచ్చిన ఈ సభకు తక్కువగా చూపేందుకు ఆరాటపడుతుంది. అక్కడ ఉన్న జనాభా ఫోటోను చూపకుండా.. కేవలం జగన్ ప్రసంగించే ఫోటోతో సరిపెట్టింది. అయితే అదే సమయంలో లోకేష్ శంఖారావసభలను హైలెట్ చేస్తుంది. వేలల్లో జనాలు హాజరైతే ఆ ఫోటోలను ప్రచురిస్తుంది. అయితే ఎవరి ప్రాధాన్యం వారిది కానీ.. జర్నలిజం విలువలను పాటిస్తున్నట్లు ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రకటించడం మాత్రం అభ్యంతరకరం. సాధారణంగా తెలుగుదేశం పార్టీ సభలకు ఐదు నుంచి పదివేల వరకు జన సమీకరణకు ప్రాధాన్యం ఇస్తుంది. అంతవరకు మాత్రమే చేయగలుగుతుంది. వైసీపీ సిద్ధం సభలను లక్షల జనాభాతో నిర్వహించాలని వైసిపి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. అధికార పార్టీ, ఆపై భారీ స్థాయిలో ఖర్చు చేస్తోంది. జనాలు తప్పకుండా వస్తారు. అందులో వైఫల్యాలను తప్పు పట్టకుండా.. తక్కువమంది వచ్చారని వితండవాదం చేయడం మాత్రం ఆ సెక్షన్ ఆఫ్ మీడియా పలుచన అవుతోంది.