Nara Lokesh: అమిత్ షాను లోకేష్ కలవడం వెనుక కథ అదా?

తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సంగతి తెలిసిందే. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. బి ఆర్ ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది.

Written By: Dharma, Updated On : October 12, 2023 3:30 pm

Nara Lokesh

Follow us on

Nara Lokesh: అమిత్ షాను లోకేష్ కలవడం వెనుక మరో కథ ఉందా? బిజెపి ప్రయోజనం కోసమే కలిశారా? చంద్రబాబు అరెస్ట్ అయిన 30 రోజుల తర్వాత కలిసేందుకు అవకాశం ఇవ్వడం ఏమిటి? అటు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం ఈ భేటీలో పాల్గొనడం దేనికి సంకేతం? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. పక్కా రాజకీయ ప్రయోజనాలతోనే బిజెపి అగ్రనేత అమిత్ షా లోకేష్ ను కలిసేందుకు అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సంగతి తెలిసిందే. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. బి ఆర్ ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. త్రిముఖ పోటీ నెలకొంది. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. కమ్మ సామాజిక వర్గం వారు బిఆర్ఎస్ కు దూరమయ్యారు. చంద్రబాబును జగన్ అక్రమంగా అరెస్టు చేయించారు. కెసిఆర్ తో జగన్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే హైదరాబాదులో చంద్రబాబు అరెస్టుపై నిరసనకు కెసిఆర్ సర్కార్ అడ్డగించిందన్న కామెంట్స్ ఉన్నాయి. మరోవైపు కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు టర్న్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ నగరం తో పాటు ఖమ్మం జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాలను కమ్మ సామాజిక వర్గాల వారికి కేటాయించాలని కోరుతూ కాంగ్రెస్ హై కమాండ్ కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల కిందట రేణుక చౌదరి నేతృత్వంలో కమ్మ ప్రముఖులు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలిశారు. తమ సామాజిక వర్గ లెక్కలను వేసుకొని టిక్కెట్లను కేటాయించాలని కోరారు.

మరోవైపు చంద్రబాబు అరెస్ట్ కు బిజెపి కారణమన్న కామెంట్స్ ఉన్నాయి. దీంతో కమ్మ సామాజిక వర్గం వారు బిజెపి వైపు అనుమానపు చూపులు చూస్తున్నారు. ఇది వచ్చే ఎన్నికల్లో నష్టం చేకూరుస్తుందని బిజెపి రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. గత నెల రోజులుగా పైగా ఢిల్లీలో ఉన్నా… కేంద్ర పెద్దలు లోకేష్ ను పట్టించుకోవడంలేదని ప్రచారం జరిగింది. దీంతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి చొరవ తీసుకొని లోకేష్ ను అమిత్ షా తో కల్పించారు. తద్వారా చంద్రబాబు అరెస్ట్ వెనుక తమ ప్రమేయం లేదని సంకేతాలు ఇవ్వడానికి… తమను కలిసేందుకు లోకేష్ కు అనుమతి ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. నెలరోజులుగా పట్టించుకోని కేంద్ర పెద్దలు సడన్గా ఇప్పుడు లోకేష్ కు అనుమతి ఇవ్వడం వ్యూహంలో భాగమేనన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు అవకాశం ఇవ్వకూడదని బిజెపి భావిస్తోంది. అక్కడ కానీ అనుకూల ఫలితాలు వస్తే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై విశేషంగా ప్రభావం చూపుతాయి. అందుకే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు లబ్ధి చేకూరే ఏ అంశాన్ని బిజెపి విడిచిపెట్టడం లేదు. కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు చూస్తే చాలా నియోజకవర్గాలు ఆ పార్టీకి చిక్కినట్టే. అందుకే కేంద్ర పెద్దలు పునరాలోచనలో పడ్డారు. కనీసం లోకేష్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వడం ద్వారా కమ్మ సామాజిక వర్గాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు అన్న భావన తోనే ఈ భేటీకి అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.