Lok Sabha Speaker: టిడిపి లోక్ సభ స్పీకర్ పదవి కోరుతోందా? కానీ బిజెపి సుముఖంగా లేదా? ఎట్టి పరిస్థితుల్లో సభాపతి పదవి వదులుకునేందుకు ఇష్టపడడం లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్డీఏ కూటమిలో బిజెపి తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం. 16 ఎంపీ స్థానాలతో ఎన్డీఏ లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది టిడిపి. అందుకే కేంద్ర క్యాబినెట్లో చేరింది. ఒక క్యాబినెట్ మంత్రి పదవితో పాటు సహాయ మంత్రి పదవి పొందింది. అయితే స్పీకర్ పదవిని కోరుకుంటుంది అన్న ప్రచారం మొదలైంది.గతంలో కేంద్ర రాజకీయాల్లో టిడిపి కీలకంగా మారిన సమయంలో.. లోక్సభ స్పీకర్ పదవిని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. నాడు జిఎంసి బాలయోగి స్పీకర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా స్పీకర్ పదవిని ఇవ్వాలని తెలుగుదేశం కోరుతోంది. అందుకు బిజెపి ససేమిరా అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేంద్రంలో లోక్ సభ స్పీకర్ పదవి కీలకం. పార్టీ ఫిరాయింపుల చట్టం, సభ్యులపై అనర్హత వేటు వంటి విషయాల్లో స్పీకర్ నిర్ణయం కీలకం. అందుకే ఆ పదవి వదులుకునేందుకు బిజెపి ఇష్టపడటం లేదు. అయితే ఇప్పుడే ఇండియా కూటమి సరికొత్త నిర్ణయాన్ని తెరపైకి తెచ్చింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ఎవరైనా స్పీకర్ అభ్యర్థిని నిలిపితే మద్దతు తెలుపుతామని ప్రకటించడం విశేషం. ఇండియా కూటమి పక్షానికి చెందిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ స్పీకర్ పదవిపై టిడిపి ఆశలు పెట్టుకుందని.. ఆ సమాచారం తమకు ఉందని.. ఒకవేళ టిడిపి అభ్యర్థిని పెడితే తప్పకుండా మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఒకవేళ స్పీకర్ పదవి బిజెపికి దక్కితే.. భాగస్వామ్య పార్టీలను చీల్చుతాయని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే టిడిపి స్పీకర్ పదవి తీసుకుంటే ఇండియా కూటమి తప్పకుండా మద్దతు తెలుపుతుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
అయితే బిజెపి పెద్దలపై చంద్రబాబు ఎటువంటి ఒత్తిడి చేయడం లేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇచ్చిన రెండు మంత్రి పదవులు సైతం కేంద్ర పెద్దలు స్వచ్ఛందంగా ఇచ్చారని.. చంద్రబాబు అసలు డిమాండ్ చేయలేదని చెప్పుకొస్తున్నారు. అయితే ఒకవేళ చంద్రబాబు పావులు కలిపితే అది పురందేశ్వరి కోసం మాత్రమేనని.. బిజెపి పరంగా ఆమెకు స్పీకర్ పదవి ఇస్తే చంద్రబాబు సైతం ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఏపీలో సోము వీర్రాజు చేతి నుంచి అధ్యక్ష పీఠం పురందేశ్వరికి వచ్చింది. అప్పటినుంచి కేంద్ర పెద్దల్లో టిడిపి పట్ల సానుకూలతో వచ్చింది. పొత్తులు, సీట్ల సర్దుబాటు విషయంలో పురందేశ్వరి సైతం టిడిపికి అనుకూలంగా పనిచేశారన్న విశ్లేషణలు ఉన్నాయి. లోక్ సభ స్పీకర్ పదవిని టిడిపి కోరుకోవడం వెనుక కూడా పురందేశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పదవి ఇస్తే తమకు ఇవ్వాలని.. లేకుంటే తమ రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపీ కి ఇవ్వాలని చంద్రబాబు షరతు పెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే పురందేశ్వరికి ఆ చాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే లోక్ సభ స్పీకర్ పదవికి టిడిపి అభ్యర్థిని పెడితే ఇండియా కూటమి మద్దతు తెలుపుతుందని భాగస్వామ్య పార్టీల నేతలు ప్రకటించడం మాత్రం సంచలనం రేపుతోంది.