https://oktelugu.com/

KCR- RK: కేసీఆర్ ను ఆర్కే భయపెడుతున్నాడా?

KCR- RK: వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్కే.. తెలుగు పత్రిక రంగంలో వినూత్నమైన జర్నలిస్ట్. ఏ విషయమైనా ముక్కుసూటిగానే మాట్లాడతాడు. వారం వారం తన పత్రికలో కొత్త పలుకు పేరిట రాసే వ్యాసాలు కుండ బద్దలు కొట్టినట్లు ఉంటాయి. ఒక్క చంద్రబాబు విషయంలోనే విధేయతను ప్రదర్శించే ఆర్కే.. మిగతా వాటిల్లో ప్రొఫెషనల్ జర్నలిజాన్ని ప్రదర్శిస్తాడు. ప్రస్తుతం తెలంగాణకు, ఢిల్లీకి దూరం పెరిగింది. ఉప్పు, నిప్పు అనే స్థాయికి వైరం ముదిరింది. మొన్నటిదాకా మోదీపై ఒంటి కాలుపై లేచిన […]

Written By: , Updated On : July 31, 2022 / 04:45 PM IST
Follow us on

KCR- RK: వేమూరి రాధాకృష్ణ అలియాస్ ఆర్కే.. తెలుగు పత్రిక రంగంలో వినూత్నమైన జర్నలిస్ట్. ఏ విషయమైనా ముక్కుసూటిగానే మాట్లాడతాడు. వారం వారం తన పత్రికలో కొత్త పలుకు పేరిట రాసే వ్యాసాలు కుండ బద్దలు కొట్టినట్లు ఉంటాయి. ఒక్క చంద్రబాబు విషయంలోనే విధేయతను ప్రదర్శించే ఆర్కే.. మిగతా వాటిల్లో ప్రొఫెషనల్ జర్నలిజాన్ని ప్రదర్శిస్తాడు. ప్రస్తుతం తెలంగాణకు, ఢిల్లీకి దూరం పెరిగింది. ఉప్పు, నిప్పు అనే స్థాయికి వైరం ముదిరింది. మొన్నటిదాకా మోదీపై ఒంటి కాలుపై లేచిన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి చుట్టూ తిరుగుతున్నారు. మొన్నటి యూపీ ఎన్నికల్లో పరాభవం తర్వాత అఖిలేష్ యాదవ్ అంతగా మాట్లాడటం లేదు. మహారాష్ట్ర సీఎం పీఠం కోల్పోయిన తర్వాత ఉద్దవ్ ఠాక్రే కూడా కిమ్మనడం లేదు. కానీ వీరందరికీ భిన్నంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత సీఎం కేసీఆర్ వరుసగా మూడు ప్రెస్ మీట్ లు పెట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఏకిపారేశారు. మరో అడుగు ముందుకేసి మొన్న ఢిల్లీకి వెళ్లారు. అక్కడ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ను కలుసుకున్నారు. చాలాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియాకు మాత్రం కేంద్రం పై యుద్ధం చేస్తున్నాం అనే సంకేతాలు ఇచ్చారు.

KCR- RK

CM KCR


తెలంగాణ ఉద్యమంలో
..
తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న రోజులవి. ఆ సమయంలో ఉద్యమం చేస్తే తెలంగాణ రాదని, దానికి రాజకీయ ప్రక్రియ శిరోధార్యం అని ఆ రోజుల్లోనే వేమూరి రాధాకృష్ణ స్పష్టం చేశాడు. దీనిపై టిఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేసినా.. తర్వాత కేసీఆర్ ఆ మార్గాన్నే అనుసరించారు. ఆర్కే జర్నలిజం టెంపర్మెంట్ కు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. వాస్తవానికి కెసిఆర్ కు, రాధాకృష్ణకు మంచి సంబంధాలు ఉన్నాయి.. పూర్వ ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశం బీట్ రిపోర్టర్ గా రాధాకృష్ణ పని చేసేవారు. అప్పట్లో కెసిఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది క్రమక్రమంగా బలపడింది. ఏరా ఒరేయ్ అని పిలుచుకునే స్థాయికి ఎదిగింది. ఇదే క్రమంలో కేటీఆర్ ఓ భూ వివాదంలో తల దూర్చారు. అది చినికి చినికి గాలి వాన అయింది. కానీ విషయాన్ని బయటికి ప్రపంచానికి ఆంధ్రజ్యోతి మాత్రమే చేరవేసింది. దీనివల్ల కేసీఆర్కు ఆర్కే కు పొరపచ్చాలు వచ్చాయి. అప్పట్లో ఉప్పు నిప్పు లాగానే ఉన్నా.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వరంగల్లో నిర్వహించిన ఓ సభలో తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను తొక్కిపడేస్తామని కెసిఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అన్నట్టుగానే అప్పట్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పై నిషేధం విధించారు. అయినప్పటికీ రాధాకృష్ణ ఎక్కడా తగ్గలేదు. పైగా సుప్రీంకోర్టు దాకా వెళ్లి కేసు గెలిచి ఛానల్ ప్రసారాలను పునరుద్ధరించుకున్నారు. ఈ విషయంలో కెసిఆర్ పై రాధాకృష్ణ విజయం సాధించారు. ఈ పరిణామం తర్వాత కెసిఆర్ తన ఫామ్ హౌస్ లో నిర్వహించిన ఆయత చండీయాగానికి రాధాకృష్ణను పిలిచారు. తర్వాత ఇద్దరు దగ్గరయ్యారు. కొన్నాళ్ల పాటు కెసిఆర్ కు ఆంధ్రజ్యోతి సపోర్ట్ లభించింది. ఇదే క్రమంలో రాధాకృష్ణ నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అప్పుడు కెసిఆర్ పరామర్శించి, జూబ్లీహిల్స్ లో ఆర్కే కు కొంత స్థలాన్ని కేటాయించారు.

ఉన్నది ఉన్నట్టుగా
..
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మీడియా హౌస్ లన్ని కెసిఆర్ కు పాదాక్రాంతం అయినవే. ఒక ఆంధ్రజ్యోతి తప్ప. కెసిఆర్ తీసుకునే ప్రతి నిర్ణయంలో ఉన్న లోసుగులను బయట పెట్టడంలో వేమూరి రాధాకృష్ణ దిట్ట. యాదాద్రి నిర్మాణ పనుల్లో స్తంభాలపై కేసీఆర్ బొమ్మలు చిత్రీకరించారని బయట పెట్టింది ఆంధ్రజ్యోతే. అలాగే భారతీయ రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని చెప్పింది కూడా ఆర్కే నే. కెసిఆర్ వ్యక్తిగతాన్ని బాగా అర్థం చేసుకున్న రాధాకృష్ణ.. ఆయన వేసే ప్రతి రాజకీయ అడుగును కూడా బయట ప్రపంచానికి చెప్పగల విలేఖరి. కెసిఆర్ తో ఇప్పుడు అంత బాగా టర్మ్స్ లేకున్నప్పటికీ.. ఇప్పటికీ అదే జర్నలిజం టెంపో కంటిన్యూ చేస్తున్నారు.. ప్రస్తుతం కెసిఆర్ కు, బిజెపికి విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న వ్యాపారుల పై ఈడి దాడులు చేస్తుందని ఆర్కే హెచ్చరించారు. ఇప్పటికే మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డిని కేంద్ర ఏజెన్సీలు ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయని తన కొత్త పలుకు వ్యాసంలో రాసుకొచ్చారు. కేంద్రంతో కెసిఆర్ అనవసరంగా తల పడుతున్నారని, బలమైన మోదీ తో పెట్టుకోవడం అంటే కోరివితో తలగొక్కున్నట్టేనని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి కెసిఆర్ కు, ఆర్కే కు మధ్య దూరం ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ… ఆయన వేసే తప్పటడుగులను ప్రతిసారి ఆర్కే ఎత్తి చూపిస్తూనే ఉన్నారు. దుబ్బాక, హుజురాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆర్కే చెప్పినట్టే ఫలితాలు వచ్చాయి. తెలంగాణ బడ్జెట్ మస్పూసి మారేడు కాయ చేస్తున్నారని, ఖజానా మొత్తం పప్పు బెల్లాల పథకాలకే సరిపోతుందని గతంలోనే ఆర్కే హెచ్చరించారు. ప్రస్తుతం అదే నిజమవుతోంది. మిత్రుడు ఎన్నటికీ కీడు చేయడని ఆదిమ రెడ్ ఇండియన్ల సామెత. ప్రస్తుతం ఆర్కే తన వ్యాసాల ద్వారా కేసీఆర్ ను హెచ్చరిస్తున్నాడు.. ఒక రకంగా చెప్పాలంటే మంచి చేస్తున్నట్టే కదా!

Tags