Rahul Gandhi Phone Tapped: కొన్ని కొన్ని సార్లు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు హస్తిమ శకాంతరం లాగా కనిపిస్తుంటాయి. ఏం మాట్లాడుతుంటారో అర్థం కాదు. ఎందుకు మాట్లాడతారో అంతు పట్టదు. అసలు అలా ఎలా సాధ్యమవుతుందో జుట్టు పీక్కున్నా ఒక పట్టాన మింగుడు పడదు.. పొరపాటున ఇదేంటని మీడియా ప్రశ్నిస్తే నాలుక మడతేస్తారు. పైగా నేను అలా ఎలా అన్నాను అంటూ వితండ వాదానికి దిగుతుంటారు. నా మాటలను మీడియా వక్రీకరించిందంటూ సులువుగా దాటవేసే ప్రయత్నం చేస్తుంటారు.
అలాంటి వ్యాఖ్యలనే తెలంగాణ రాష్ట్రంలో ఓ రాజకీయ నాయకుడు చేశారు. గతంలో ఆ అధికారి ఐపిఎస్ గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకులాల కార్యదర్శిగా కొనసాగారు. ఆ తర్వాత తన సర్వీస్ కు స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. అనంతరం బహుజన్ సమాజ్ వాది పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అప్పట్లో కెసిఆర్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కొన్ని సందర్భాలలో ఆయన చేసిన నిరసనలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి… ఇంత చదివిన తర్వాత ఆయన ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట్లో అంబేద్కర్ కలలుగన్న రాజ్యాన్ని సాధిద్దామని.. బహుజనులకు రాజ్యాధికారాన్ని దక్కేలా చేద్దామని చెప్పిన ఆయన.. ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు.. అంతేకాదు భారత రాష్ట్ర సమితిలో చేరి.. అందరికీ షాక్ ఇచ్చారు.
Also Read: మీ పిచ్చి కాకపోతే స్టేటస్ లు పెట్టుకుంటే పొలోమని రేపటి జర్నలిస్టులు వచ్చేస్తారా?
ప్రస్తుతం భారత రాష్ట్ర సమితిలో కీలక నాయకుడిగా కొనసాగుతున్న ప్రవీణ్ కుమార్ తనదైన శైలిలో అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో తన లైన్ దాటి వ్యవహరిస్తున్నారు.. ఫోన్ సంభాషణల కేసులో ఆయన నోటీసులు అందుకున్నారు. సిట్ అధికారుల విచారణకు హాజరుకానున్నారు. అయితే ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. వాస్తవానికి ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసీసీ కీలక నాయకుడు రాహుల్ గాంధీ ట్యాప్ చేయిస్తున్నారట. అది కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా డైరెక్షన్లో సాగుతోందట. రేవంత్ రెడ్డి అందులో భాగస్వామి అట. కేవలం రాహుల్ గాంధీది మాత్రమే కాకుండా, ఎఐసిసి సభ్యులకు కూడా రేవంత్ రెడ్డి టాపింగ్ చేయిస్తున్నాడట. అంతేకాదు పోలీసులను పక్కనపెట్టి ప్రైవేట్ స్పై ఏజెన్సీ లతో రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నాడట.. నాడు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఫోన్ టాప్ చేస్తున్నారని భారత రాష్ట్ర సమితి పెద్దలపై విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో చాంతాడంత ట్వీట్లు చేశారు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. పాపం ఈ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఒకప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా ఉండేవారు. ఇప్పుడేమో ఇలా మారిపోయారు.