CM Jagan PRC: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు పథకాల నిర్వహణలో వేగంగా దూసుకెళ్తోంది. ప్రజా సంక్షేమం కోసం రూ.కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఉద్యోగులకు మాత్రం మొండి చేయి చూపుతున్నారని నైరాశ్యంలో ఉన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. తమను పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. సారును కలిసి సమస్య విన్నవించుకుందామంటే.. వినరాయే.. చెప్పింది పట్టించుకోరాయే అంటూ.. ఇటీవల తిరుపతిలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు సీఎం జగన్ ను కలిశారు. తమ సమస్యను విన్నవించుకున్నారు. జగన్ సైతం దానికి సానుకూలంగా స్పందించారు. ప్రజా పాలన ఎంత ముఖ్యమో.. ప్రభుత్వాన్ని నడిపే ఉద్యోగులు కూడా అంతే ముఖ్యమని వారితో చెబుతూనే.. రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన ఉద్యోగులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా పాలనతో ప్రభుత్వ ఉద్యోగుల పాలిట పెద్దన్నగా అభివర్ణించారు.
Also Read: జగన్ చేసిన పనికి అందరూ ఫిదా అయిపోయారట.. ఇంతకీ ఏం చేశారు?
అయితే ఇక్కడే ఓ పెద్ద చిక్కొచ్చి పడింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీ నిండా ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండానే జగన్ సర్కారును ప్రారంభించారు. అయినా అధైర్య పడకుండా అప్పులు తీసుకొస్తూనే ప్రజా సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఇప్పటికీ ఠంఛన్ గా ఒకటో తారీకు పించన్లు.. ఇతర పథకాలకు సంబంధించిన నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కొత్త పథకాలు ప్రారంభిస్తున్నారు. ఉన్న పథకాలను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇవ్వన్నీ పథకాలకు రూ.వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. అప్పులిచ్చే బ్యాంకులు కూడా ఏపీపై నైరాశ్యంగా ఉంటున్నాయి. ఇచ్చిన అప్పులు తీర్చేదెప్పుడని జగన్ పీకల మీద కూర్చున్నాయి. అయినా సీఎం వెనక్కి తగ్గడం లేదు. నిధులున్నా.. లేకున్నా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సర్కారును నడిపిస్తున్నారు.
పథకాలకైతే ఏడాదికో.. రెండేళ్లకో.. ఐదేళ్లకో నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మరి ఉద్యోగుల పీఆర్సీ విషయంలో.. అలా కాదు.. నెలనెలా రెట్టింపు నిధులు బడ్జెట్లో జమచేయాల్సి ఉంటుంది. లేకుంటే సర్కారు ఉద్యోగుల జీతాల్లో కోత.. లేదా నిలిపివేత జరుగుతుంది. ఈ క్రమంలో సీఎం ఇచ్చిన హామీ నిలబడుతుందా..? హామీకి అనుకూలమైన నిధులు సర్కారు దగ్గర ఉన్నాయా? పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు సర్కారుకు సయోధ్య కుదురుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరీ.. ఏం జరుగుతుందో?
Also Read: వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కత్తితో పొడిచి కుర్చీ లాక్కునే వాడిని.. చంద్రబాబుతో రోశయ్య వ్యాఖ్యలు వైరల్