
ప్రధాని మోడీ ఏది చేసినా సంచలనమే. ఏ పనిలో అయినా రికార్డే. కానీ.. ఇటీవల చేసిన ఓ తప్పిదం ఇప్పుడు యావత్ దేశాన్ని వేధిస్తోంది. దేశంలో మొన్నటి వరకు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. అన్ని పార్టీలూ ఆ ఎన్నికల హడావిడిలోనే ఉండిపోయాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఆ ఎన్నికలనే టార్గెట్ చేసుకుంది. దీంతో ప్రధాని మోడీ, అమిత్ షా వంటి దిగ్గజాలు ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేశారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో ఇంకో మూడు విడతల్లో పోలింగ్ ఇంకా మిగిలి ఉంది.
దేశంలో ఓ వైపు కరోనా విజృంభిస్తోంది. మరోవైపు.. దేశ ప్రధాని సహా ముఖ్యులందరూ ఆ ఎన్నికల ప్రచారంలో ఉండిపోయారు. దీంతో మొదట్లో నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా బీభత్సం సృష్టిస్తోంది. అటు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ నడుస్తున్నా.. పెద్దగా ఫలితాలు ఏం కనిపించడం లేదు. ఫలితంగా ఇప్పుడు కరోనాతో విలవిల్లాడిపోతున్నారు. పిట్టల్లా రాలిపోతున్నారు. లక్షలాది సంఖ్యలో వస్తున్న కేసులు గందరగోళానికి గురిచేస్తున్నాయి.
ఒక్క నిర్లక్ష్యం.. మరెన్నో అనర్థాలకు మార్గం అన్నట్లుగా.. ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ అప్పుడే కరోనాను సీరియస్‌గా తీసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని విపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం బెడ్ల కోసం యుద్ధాలే జరుగుతున్నాయి. ఆక్సిజన్ కోసం సిలిండర్లో పేషెంట్ల బంధువులు క్యూలో ఉండాల్సిన దుస్థితి వచ్చింది. కొందరైతే తమ కుటుంబ సభ్యులను కోల్పోయి.. ఆప్తులను కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోతున్నారు.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. అన్ని చావులు.. అన్ని కేసులు నమోదయ్యాక మంగళవారం రాత్రి ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఏదో ప్రకటన చేస్తారని అందరూ ఎంతో ఆతృతగా చూశారు. మోడీ నుంచి ఏదైనా సంచలన ప్రకటన వస్తుందని అనుకున్నారు. కానీ.. ఎలాంటి షాకింగ్‌లు లేకుండా ప్రసంగాన్ని ముగించారు. రోటీన్‌కు భిన్నంగా మాట్లాడి.. సాదాసీదాగా కానిచ్చేశారు. సెకండ్ వేవ్ విస్తృతంగా విజృంభిస్తుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే.. లాక్‌డౌన్ విషయాన్ని పూర్తిగా రాష్ట్రాల పైనే వేసేశారు. పరిస్థితిని బట్టి లాక్‌డౌన్ అమలు చేయాలని సూచించారు. అంతే తప్పితే ప్రజల్లోనూ పెద్దగా భరోసా కల్పించినట్లుగా ప్రసంగం సాగలేదు. మనసులను హత్తుకునేలా ఈసారి మోడీ నోట ఆవేదన పూర్వక వ్యాఖ్యలైతే ఏమీ వినపడలేదు.