
మావోల ప్రాబల్యం క్రమంగా తగ్గుతోంది. పోలీసుల వ్యూహాలకు ఎక్కడికక్కడ మావోలు దొరికిపోతున్నారు. పోలీస్ బలగం పెరగడంతో నిత్యం కూంబింగ్ లు చేపడుతూ అడవులను జల్లెడ పడుతున్నారు. దీంతో ఎక్కడ దాక్కున్నా దొరికిపోతూ బలైపోతున్నారు. రానురాను మావోల జాడ కనిపించకుండా పోతోంది. పోలీసుల చతురతతో వారి కదలికలను గుర్తిస్తూ మట్టుపెడుతున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం విధితమే. ఏడాదిగా ఇక్కడ పోలీసుల పట్టు పెరుగుతోంది. వరసగా కూంబింగులు చేపడుతూ మావోల స్థావరాలను టార్గెట్ చేస్తున్నారు.
2018లో ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చారు. అప్పట్లో ఆ సంఘటన సంచలనం సృష్టించింది. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల అలజడి పెరిగిందని అందరు భావించారు. అంతకుముందు కూడా మావోల చేతిలో అనేక మంది ప్రజాప్రతినిధులు బలైన సంఘటనలున్నాయి. కానీ ప్రస్తుతం సీన్ మారుతోంది. మావోల ఉనికికే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. పోలీసుల దెబ్బలను ఎదుర్కోవడంలో వారు విఫలమవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మావోల మనుగడ కష్టమేనని పలువురు పేర్కొంటున్నారు.
మావోలకు వ్యతిరేకంగా గిరిజనుల్లో చైతన్యం కలిగించడంలో పోలీసులు విజయం సాధించారు. దీంతో వారి కదలికలు ఎప్పటికప్పుడు తెలిసిపోతున్నాయి. మెల్లమెల్లగా మావోలు పట్టు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఏడాదిలో ఏడెనిమిది మంది మావోలకు ఆంధ్ర, ఒడిశా బోర్డర్ లో దెబ్బ మీద దెబ్బలే తగులుతున్నాయి.
విశాఖ మన్యంలో పోలీస్ యంత్రాంగం ఒక పథకం ప్రకారం ఏజెన్సీలో మావోలకు చెక్ పెడుతూ వస్తోంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. దీంతో మావోలకు ఎదురుదెబ్లలు తగిలినట్లు అవుతోంది. ఉద్యమంలో ఉన్నమావోలు సైతం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు పోలీసులు మన్యాన్ని జల్లెడ పడుతూ మావోల వ్యూహాలను ఎప్పటికప్పుడు పటాపంచలు చేస్తున్నారు.