Homeజాతీయ వార్తలుKTR: సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి తప్పదా? షాకింగ్ పరిణామాలు

KTR: సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి తప్పదా? షాకింగ్ పరిణామాలు

KTR: ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో రాష్ట్రంలో సింహభాగం నిధులు దక్కించుకున్న మూడు నియోజకవర్గాల్లో సిరిసిల్ల ఒకటి. ఇక్కడ చేయని అభివృద్ధి లేదంటూ కేటీఆర్ పదేపదే చెప్పుకుంటారు. నమస్తే తెలంగాణ పేజీలకు పేజీలు వార్తలు కుమ్మేస్తూ ఉంటుంది. అంతేకాదు సిరిసిల్లలో కేటీఆర్ కు ఎదురన్నదే లేదు అని ఘంటా పథంగా చెబుతుంది. గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే అని అంటుంది. కానీ ప్రజలు ఆ స్థాయి దాటి నిక్కచ్చిగా తమ నిర్ణయం ఏమిటో చెప్పదలుచుకున్నారా? అందుకే గంభీరమైన మౌనాన్ని పాటిస్తున్నారా? అంటే ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తుంది.

గత పరిస్థితి ఎలా ఉందంటే

భవిష్యత్తు ముఖ్యమంత్రిగా కేటీఆర్ వార్తల్లో పదేపదే నిలుస్తున్నారు. రాజకీయ జీవితం ఏ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించారో.. అక్కడే ఓటమిపాలై శాసనసభకు మాత్రమే కాకుండా భవిష్యత్తు ముఖ్యమంత్రి పదవికి దూరమవుతారా? అంటే.. ఆ పరిస్థితికి అవకాశం ఉందని అక్కడి క్షేత్రస్థాయి విషయాలను బట్టి తెలుస్తోంది. కేటీఆర్ మొదటి సారి కేకే మహేందర్ రెడ్డి ని 177 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఓడించారు. ఈసారి కేకే మహేందర్ రెడ్డి అలాంటి ఓటమినే కేటీఆర్ కు రుచి చూపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి పట్ల గూడు కట్టుకున్న వ్యతిరేకత, ఆ వ్యతిరేకతకు కేటీఆర్ కూడా మినహాయింపు కాకపోవడం, రెండుసార్లు అవకాశం ఇచ్చాం, ఇక చాలు.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దాం అనే భావన ప్రజల్లో పెరిగిపోవడం, ఇదివరకే రెండు మూడు సార్లు ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి పట్ల సానుభూతి పెరగడం, ఇవి కేటీఆర్ గెలుపును ప్రశ్నార్ధకం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేటీఆర్ మొదటి, రెండవ శ్రేణి నాయకత్వానికి మాత్రమే అందుబాటులో ఉండడం, అభివృద్ధి, సంక్షేమం తప్ప అంతకంటే మించిన ఆత్మ గౌరవాన్ని తట్టి లేపే లేదా గౌరవించే విధానాన్ని ఆచరణలో పెట్టకపోవడం, ఆ సంస్కారాన్ని ఎక్కడా కూడా ప్రదర్శించకపోవడం కేటీఆర్ పై వ్యతిరేకతకు కారణమని తెలుస్తోంది.

మినహాయింపు కాలేదు

కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం లో నాలుగు రకాల మాఫియాలు చెలరేగిపోతున్నాయి.. ఇసుక, భూమి, మద్యం, కంకర వంటి వ్యాపారాల్లో ఆయన బంధువులు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నేరెళ్ల బాధితుల ఆవేదన, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వంటి ఉదంతాలు సిరిసిల్ల వ్యాప్తంగా ఇప్పటికీ చర్చలోనే ఉన్నాయి. సహజంగా ఇది కేటీఆర్ చూపిస్తున్న అభివృద్ధి నమూనాను కింద పడేస్తోంది.. అయితే ఇటువంటి పరిణామాలను కేటీఆర్ అండ్ కో తేలిగ్గా తీసి పడేస్తోంది. ఇటువంటి అసమ్మతిని వారు లోలోపల గులుగుడుగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం చాలా కృత నిశ్చయంతో ఉన్నారని అక్కడి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. సిరిసిల్ల నియోజకవర్గం లోని ఐదు మండలాలకు కేటీఆర్ తన సొంత సామాజిక వర్గంలోని ఒక్కో వ్యక్తిని ఇన్చార్జిగా నియమించుకున్నట్లు తెలుస్తోంది. వారి ఆగడాలకు అంతు లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. సిరిసిల్ల జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని చెందిన తోట ఆగయ్యను నియమించారు. కానీ ఆయన మీద అత్యాచారం లాంటి ఆరోపణలు ఉండడంతో కింది స్థాయి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. పైగా కేటీఆర్ కూడా ఒక కోటరికి మాత్రమే పరిమితం కావడంతో కార్యకర్తల్లో మనోధైర్యం సన్నగిల్లుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్టే సిరిసిల్లతోపాటు తంగళ్ళపల్లి, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీ రావు పేట, ముస్తాబాద్ మండలాల్లో రోజురోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..

రెండు లక్షల ఓటర్లు

మొత్తం 2,44,426 ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో 80 వేల 443 ఓటర్లు సిరిసిల్ల పట్టణంలో ఉన్నారు. ఇందులో కేవలం 60 వేలకు పైగా ఓటర్లు పద్మశాలిలే. బతుకమ్మ చీరల ఆర్డర్ల వల్ల పద్మశాలీలకు ఆర్థిక భరోసా పెరిగిందని భారత రాష్ట్ర సమితి ప్రచారం చేస్తోంది. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇద్దరు పోటీ చేస్తుండటంతో.. గతంలో మాదిరి కేటీఆర్ కు గంప గుత్తగా ఓట్లు పడే అవకాశం లేదు. ఇక ఈ ప్రాంతంలో సేవ తత్పరుడిగా పేరు ఉన్న లగిశెట్టి శ్రీనివాస్ పద్మశాలిల ఓట్లు ఎక్కువగా పొందే అవకాశం కనిపిస్తోంది.. స్వాతంత్రానంతరం నుంచి ఈ నియోజకవర్గంలో పద్మశాలి ఆత్మ గౌరవాన్ని తట్టి లేపే చొరవ తీసుకున్న నాయకుడు ఇదివరకు ఎవరు కూడా పోటీ చేయలేదు. ఈసారి ఆ విశేషం కేటీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి సిరిసిల్లలో కేటీఆర్ కు ఎదురుగాలి వారు ఉదహరిస్తున్నారు. ఇవన్నీ నిజమవుతాయా? లేక కేటీఆరే తిరిగి ఎమ్మెల్యే అవుతారా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం డిసెంబర్ 3న తెలుస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version