Jagan Overconfident: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ భారీ ఆధిక్యతతో గెలిచింది. గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీని అధిగమించింది. పోలైన ఓట్లలో లక్ష పైచిలుకు ఆ పార్టీయే సొంతం చేసుకుంది. కానీ ఈ గెలుపుపై అటు అధికార పార్టీలో, ఇటు విపక్షాల్లో మిశ్రమ స్పందన లభిస్తుంది. ఎవరికి వారు తమకు అనుకూలం అనాలసిస్ చేస్తున్నారు. తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని వైసీపీ మంత్రులు, నాయకులు ఘంటాపధంగా చెప్పుకొచ్చారు. కానీ ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టడంతో వారి ఆశలు నీరుగారిపోయాయి. వారి టార్గెట్ కు మరో 11 వేల ఓటర్ల దూరంలో అధికార పార్టీ నిలిచిపోయించింది. బీజేపీ అభ్యర్థి పట్టుమని 20 వేలు ఓట్లు కూడా సంపాదించలేక చతికిల పడ్డారు. ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 19,352 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 1,02,074 ఓట్లు పోలవ్వగా.. ఇతరులకు 11 వేలు పైచిలుకు ఓట్లు పడ్డాయి. నోటాకు రికార్డు స్థాయిలో 4 వేలకు పైగా ఓట్లు పడడం విశేషం.

పోటీకి దూరంగా టీడీపీ
ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి పోటీ చేయలేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 40 శాతం ఓట్లు లభించాయి. ఉప ఎన్నికల్లో టీడీపీ ఓట్లు ఎటు వెళ్లాయన్న విషయం అంతు పట్టడం లేదు. బాహుశా టీడీపీ పోటీలో లేని కారణంగా ఓటింగ్ శాతం తగ్గినట్టు భావిస్తున్నారు. సిట్టింగ్ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం, మేకపాటి కుటుంబసభ్యులకు పట్టున్న నియోజకవర్గం కావడంతో వైసీపీ నేతలు లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తామని ప్రారంభం నుంచి చెబుతూ వస్తున్నారు. కానీ వారి టార్గెట్ కు మాత్రం చేరుకోకపోవడం చర్చనీయాంశమైంది. వైసీపీ కీలక నేతలు అంతా ఉండి ప్రచారం చేశారు. కానీ ఓటర్లను పూర్తిస్థాయిలో పోలింగ్ బూత్ లకు రప్పించలేకపోయారు. దిగువస్థాయి కేడర్ ఏమంతా ఆశించిన స్థాయిలో పనిచేయలేదని చెప్పొచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న విపక్షాల ఆరోపణలను ఆత్మకూరు ఉప ఎన్నిక పటాపంచలు చేసిందని వైసీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తాజా ఫలితంతో వైసీపీలో జోష్ నెలకొంది.

వ్యూహం లేకుండా బీజేపీ..
మరోవైపు బీజేపీ తన బలాన్ని అంచనా వేయకుండా బరిలో దిగుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కనీసం గ్రామస్థాయి కమిటీలు లేని నియోజకవర్గాల్లో పోటీ చేయడమేమిటని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి బూత్ కమిటీల కీలకం. రెండు స్థానాలతో ప్రస్తానం ప్రారంభించి ఈ స్థాయికి చేరుకోవడం వెనుక బూత్ కమిటీలు బలోపేతం కావడమే కారణం. కానీ ఏపీలో మాత్రం బీజేపీ నేల విడిచి సాము చేస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కుటుంబ వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమంటూ ఎమ్మెల్యేలు అనారోగ్యంతో మరణించి ఉప ఎన్నికలు వచ్చిన ప్రతీసారి బీజేపీ పోటీచేసి చేతులు కాల్చుకుంటోంది. ఎన్నికల నోటిఫికేషన్ వరకూ క్యాండిడేట్ ఎవరో తెలియదు? చివరి నిమిషం వరకూ ప్రకటించరు. ఇతర మిత్ర పక్షాలు, పోటీకి దూరంగా ఉన్న పార్టీలను సంప్రదించరు. తమది జాతీయ పార్టీయని తెగ బిల్డప్ ఇస్తుంటారు. బరిలో దిగి పరువు పోగొట్టుకుంటున్నారు. ఏపీలో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీకి టిపాజిట్లు కూడా దక్కడం లేదు. బద్వేలు, తిరుపతి, ఇప్పుడు ఆత్మకూరులో కనీస స్థాయిలో కూడా బీజేపీ ఓట్లు సాధించలేదు.
నాయక గణం ఉన్నా..

పోనీ భారతీయ జనతా పార్టీకి నాయకులు లేరంటే.. చాంతాడంత జాబితా ఉంది. కానీ ఎవరూ పార్టీకి అక్కరకురాని స్థితిలో ఉన్నారు. బహుశా అందుకే కాబోలు జాతీయ స్థాయి నాయకత్వం ఏపీని పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో జగన్ బీజేపీ పెద్దలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. పరస్పర ప్రయోజనాలను పొందుతున్నారు. కేసుల రీత్యా బీజేపీ అగ్ర నాయకత్వాన్ని జగన్ ప్రసన్నం చేసుకుంటున్నారు. అదే సమయంలో కేంద్రానికి అవసరమైన అన్ని సమయాల్లో కూడా జగన్ సాయం చేస్తున్నారు. విచిత్రమేమిటంటే ఆత్మకూరు పోలింగ్ ఒక వైపు జరుగుతుంటే..హస్తినాలో రాష్ట్రపతి నామినేషన్ వేసిన ఎన్టీఏ అభ్యర్థికి మద్దతుగా వైసీపీ కీలక నేతలైన విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. అందుకే ప్రజల్లో కూడా వైసీపీ, బీజేపీ ఒక్కటేనన్న భావన ఉంది. అది బీజేపీకి మైనస్ గా మారుతోంది. ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం ద్వారానైనా బీజేపీ వ్యూహం మార్చకుంటే మంచిది.
జగన్ గ్రేట్..
తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టకుండా సీఎం జగన్ వైసీపీ అభ్యర్థులను గెలిపించుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో కనీసం ప్రచారానికి వెళ్లకుండా ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం విశేషం. దీనికి ఆ పార్టీ సంస్థాగత బలం. వ్యవస్థలు చెప్పుచేతల్లో ఉండడం ఒక కారణం. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం, పార్టీలో జగన్ ది వన్ మేన్ షో. పార్టీలో ఆయన మాటకు తిరుగుండదు. నేతలు తోకజాడిస్తే ఇట్టే కత్తిరిస్తారు. పొమ్మన లేకుండా పొగ పెడతారు. పార్టీలో జగన్ మాటకు తిరుగుండదు. దీనికితోడు ఇప్పటివరకూ ఆయన వ్యూహాలు విజయవంతమయ్యాయి. ఇది కూడా పార్టీలో ఆయన పట్ల చెక్కుచెదరని అభిమానానికి ఒక కారణం. దీనికితోడు గ్రామస్థాయిలో బలమైన సేనగా వలంటీరు వ్యవస్థను నిర్మించుకున్నారు. ప్రతీ 50 కుటుంబాల బాధ్యతను వారికి అప్పగించారు. సచివాలయ వ్యవస్థను కూడా తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. ఇవన్నీ జగన్ కూ సానుకూలాంశలుగా మారిపోయాయి. మరోవైపు విపక్షాల్లో అనైక్యత కూడా ఆయనకు కలిసి వచ్చింది. ప్రధాన విపక్షాన్ని నియంత్రించడానికి ఇతర పక్షాలను వినియోగించుకునే శక్తియుక్తులు ఇప్పుడు జగన్ వద్ద ఉన్నాయి. ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చే అంశాలే. అందుకే ఆయన తన ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టకుండా పాలన సాగిస్తున్నారు., ఉఫ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించగలుగుతున్నారు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నది మాట వాస్తవం.
Also Read: TRS Vote For Congress Presidential Candidate: కాంగ్రెస్ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థికే టీఆర్ఎస్ ఓటు
[…] […]