KCR On Visakha Steel: ఉత్తరాంధ్రలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ ప్రాంతంలో కీలకంగా ఉన్న విశాఖ ఉక్కు చుట్టూనే రాజకీయ పార్టీలు దృష్టిని కేంద్రీకరించాయి. కేంద్రం ప్రైవేటీకరణ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో ఈ ప్రాంత వాసులు ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత ఏపీలో కాలు మోపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందుకు విశాఖ ఉక్కు అంశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం బిడ్డు వేస్తే తాను పాల్గొంటానని ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది సాధ్యమయ్యే పనేనా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎప్పటినుంచో ఇక్కడ ప్రజాసంఘాలతో పాటు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటీకరణ చేయబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ముడి సరుకు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని నష్టాల బాటలోకి నెట్టి వేసేలా ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విశాఖలో జరుగుతున్న ఉక్కు కార్మికుల దీక్షకు మద్దతు పలికారు. తాము ప్రైవేటీకరణకు విరుద్ధమని ప్రకటించారు. కేసీఆర్ తో భారీ బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
కేంద్రం చెబుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయా అన్నది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే, కేరళలో ఎయిర్ పోర్టు ప్రైవేటుపరం చేస్తామనడంతో, అక్కడి ప్రభుత్వం పాల్గొనాలని చూసినా, కేంద్రం అడ్డుకుంది. కోర్టుకు వెళ్లినా సాధ్యపడలేదు. చివరకు అదానీకి ఆ ఎయిర్ పోర్టును అప్పగించింది. ఈ క్రమంలో ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులను ఆహ్వానిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కేంద్రం చెబుతున్న ప్రైవేటీకరణ ఉద్దేశ్యంలో వర్కింగ్ క్యాపిటల్, మెరుగైన ఉత్పత్తి సామర్థ్యం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తేనే జరుగుతుంది. అటువంటప్పుడు ప్రభుత్వాలకు అవకాశం ఇవ్వడమనేది జరగనపని.
ఏపీ ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగానే చెబుతుంది. తాను బిడ్ లో పాల్గొనని తేల్చి చెప్పకపోయినా, సైలెంటుగా ఉంటుంది. బిడ్ లో పాల్గొంటే ప్రైవేటీకరణకు మద్దతు ఇస్తున్నట్లే కదా అని చెబుతుంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటానంటే కేంద్రం ససేమిరా ఒప్పుకోదు. ఒకవేళ బిడ్ వేసినా కొనగలిగే శక్తి ఉందా అనేది ప్రధాన ప్రశ్న. విశాఖ ఉక్కు విలువ చూసుకుంటే సుమారు రూ.3 లక్షల కోట్ల పై మాటే ఉంటుంది. అంత మేర తెలంగాణ ప్రభుత్వం భరించగలదా అన్నది మరో ప్రశ్న. సింగరేణిలో ఆ ప్రభుత్వం వాటా 59 శాతం ఉంటే, కేంద్ర ప్రభుత్వ వాటా 41 శాతం ఉంది.
బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే తన పని అని కేసీఆర్ అంటున్నారు. ఆయన ప్రకటనపై కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి పెద్దగా స్పందన లేకపోయినా, ఏపీలో కేసీఆర్ వ్యూహాలు ఫలించకుండా చేయడమే వారి ప్రథమ కర్తవ్యం. అందుకని కేంద్ర మంత్రితో విరుద్ధమైన ప్రకటనలు చేయించారనే చర్చ మొదలైంది. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మనసు మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వదలచుకుంటే, కేసీఆర్ కు ఎందుకు ఇస్తుంది?. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీలు సాధ్యా సాధ్యాలను పక్కనపెట్టి మరీ ప్రకటనలు ఇచ్చేస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తాత్కాలికంగా వాయిదా పడినట్లుగానే ఉన్నా, రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుకు ప్రధాన వనరుగా మారిందనడంలో సందేహం లేదు.