
Amaravathi : విభజిత ఏపీకి అమరావతి రాజధానిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందరి ఆమోదయోగ్యంతో రూపుదిద్దుకున్న అమరావతి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వీర్యమవుతూ వస్తోంది. జగన్ సర్కారు అమరావతిపై విషం చిమ్ముతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్క అధికార వైసీపీ మినహా మిగతా రాజకీయ పక్షాలన్నీ అమరావతికి మద్దతు తెలిపాయి. అమరావతే ఏకైక రాజధానిగా తీర్మానించాయి. మద్దతు తెలిపాయి. అమరావతి రైతుల వెన్నంటే నడిచాయి. అయితే అది అంతవరకూ ధర్మంగా భావిస్తున్నా.. అధికార పార్టీ చర్యలకు ప్రతిఘటించే క్రమంలో అమరావతిని ఓ అంతర్జాతీయ గుర్తింపుగా చూపించేందుకు జరుగుతున్న ప్రయత్నం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
అలూ లేదు.. చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అమరావతిని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తగిలించాలన్న ప్రయత్నంలో జరుగుతున్కన పరిణామాలు మరింత నవ్వుల పాలు చేస్తున్నాయి. ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ డైజెస్ట్ మ్యాగజైన్ విడుదల చేసిన జాబితాలో అమరావతి రాజధానికి 6వ స్థానం దక్కింది. నిర్మాణంలో ఉన్న ప్రపంచ స్థాయి నగరాల జాబితాను ఈ సంస్థ రూపొందించగా అందులో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఆరో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆ జాబితాలో అమరావతి ఆరో స్థానాన్ని దక్కించుకోవడంపై ర్షం వ్యక్తం చేశారు. అయితే ఇదే అదునుగా టీడీపీ అనుకూల సోషల్ మీడియా, ఎల్లో మీడియా సరికొత్త ప్రచారానికి తెరతీశాయి.
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఆనవాళ్లు కోల్పోయిన అమరావతి నగరం గుర్తించి మ్యాగజైన్ తాహత్తుకు మించి చెప్పింది.పోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిందని, కానీ, అమరావతి కార్యరూపం దాల్చలేదని ఆ మ్యాగజైన్ వెల్లడించింది. కానీ, భవిష్యత్తులో రూపుదిద్దుకునే కొత్త నగరాలు ఎలా ఉండాలో చెప్పేందుకు అమరావతి ఒక నమూనా అని గొప్పగా అభిప్రాయపడింది. అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకున్నా.. అదో మహా అద్భుతంగా చెప్పుకొచ్చింది. ఏపీ రాజధాని ప్లాన్ లో ప్రభుత్వ భవన సముదాయం నగరానికి వెన్నెముకలా ఉంటుందని, ఢిల్లీలోని ల్యుకింగ్ సెంట్రల్ పార్క్ మాదిరిగా అమరావతి నగరం మధ్యలో భారీగా పచ్చదనం ఉండేలా డిజైన్ చేశారని ప్రశంసించింది. నగరంలో 60 శాతం పచ్చదనం, నీరు ఉండేలా డిజైన్ చేయడం చాలా గొప్ప విషయమని ఆ మ్యాగజైన్ ప్రశంసించింది.
అయితే ఇదే అదునుగా ఎల్లో మీడియా మరింత రెచ్చిపోతోంది. ప్రఖ్యాత మేగజైన్ ప్రశంసించడంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. అనుకున్నట్టుగా అమరావతి రూపుదిద్దుకొని ఉంటే ప్రపంచ మహా నగరాల్లో అమరావతి సుస్థిర స్థానం దక్కించుకొని ఉండేదని చెప్పించే ప్రయత్నం చేస్తోంది. అమరావతి మేథావులు, అనుకూలురుకు డిబెట్ కు తీసుకొచ్చి బల్లగుట్టి ప్రజల్లో సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.అయితే అమరావతికి అన్యాయం జరిగింది వాస్తవం. అందరి ఆమోదంతో గుర్తించింది వాస్తవం. రాజధానిగా అభివృద్ధి చేయ్యాలన్నది వాస్తవం. కానీ ఇంకా రాజధాని ఏర్పడక ముందే దానికి అంతర్జాతీయ ఖ్యాతిని మాత్రం అంటగట్టడం కాస్తా అతే అవుతుంది. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారాలను విశ్లేషకులు తప్పుపడుతున్నారు.