Gorantla Madhav: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఈసారి టిక్కెట్ లేనట్టేనా? పక్కన పెట్టేందుకు వైసిపి హై కమాండ్ దాదాపు నిర్ణయం తీసుకుందా? ఆయన రాజకీయ జీవితం ఒక టర్మ్ కే పరిమితమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు మాధవ్. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారన్న విమర్శను మూటగట్టుకున్నారు.
అనంతపురంలో సీఐగా ఉన్న మాధవ్ దూకుడుగా వ్యవహరించేవారు. టిడిపి ప్రభుత్వ హయాంలో.. నాటి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి కే సవాల్ చేశారు. వైసిపి హై కమాండ్ దృష్టిలో పడ్డారు. హిందూపురం ఎంపీ సీటును దక్కించుకున్నారు. టిడిపికి అనుకూలమైన ఈ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.అయితే ఏడాది కిందట ఆయన చుట్టూ రేగిన వివాదం దేశవ్యాప్తంగా సంచలనగా మారింది. ఆయన ముప్పేట విమర్శలను ఎదుర్కొన్నారు.ప్రజల్లో చులకనగా మారారు. ఆయనను వెనుకేసుకు రావడానికి నాయకత్వం సైతం ఇబ్బంది పడింది. ఈ తరుణంలో ఆయనను తప్పిస్తారని అప్పట్లోనే ప్రచారం జరిగింది.
కురుబ సామాజిక వర్గానికి చెందిన మాధవ్ గత ఎన్నికల్లో అనూహ్య విజయం దక్కించుకున్నారు. గాని ఈసారి ఆయనపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఐపాక్ సర్వేలో తేలింది. ఆయన కానీ టిక్కెట్ ఇస్తే ఓటమి తప్పదని సర్వే ఫలితాలు తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వైసిపి నాయకత్వం పునరాలోచనలో పడినట్లు సమాచారం. కురుబ సామాజిక వర్గం కర్నూలు జిల్లాలో అధికం. ఆ జిల్లాలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి మాధవ్ను పోటీ చేయిస్తారని భావించారు. కానీ ఎక్కడా ఖాళీలు లేకపోవడంతో మాధవ్ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బెర్త్ లేనట్టేనన్న ప్రచారం ఊపందుకుంది.
హిందూపురం పార్లమెంటు సీటును మాజీమంత్రి శంకర్ నారాయణకు కేటాయిస్తారని తెలుస్తోంది.ఆయన సైతం కురుబ సామాజిక వర్గానికి చెందిన వారే. ఆయన అయితే కొంతవరకు పోటీ ఇవ్వగలరని ఐపాక్ నివేదికలో తేలినట్లు సమాచారం. అయితే దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. తన దూకుడు స్వభావంతో సీఐ నుంచి ఎంపీగా మారిన మాధవ్ ఒక టెర్మ్ కే పరిమితం కానున్నారని తెలియడంతో..ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.