Magunta Family: ఒంగోలు నుంచి మాగుంట కుటుంబం పోటీ డౌటే?

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పెంచుకుంది. జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. వై వి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి నెలకొంది.

Written By: Neelambaram, Updated On : October 16, 2023 11:43 am
Follow us on

Magunta Family: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈసారి పోటీ నుంచి తప్పుకుంటారా? ఆయన మనస్తాపంతో ఉన్నారా? మద్యం కుంభకోణంలో పార్టీ తనకు అండగా నిలవలేదని భావిస్తున్నారా? అందుకే ఈసారి పోటీ నుంచి తప్పుకోవాలని చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాగుంట కుటుంబం పేరు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఈ కేసు కొనసాగుతూ వస్తోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి అరెస్టయ్యారు కూడా. ఈ తరుణంలో పార్టీ నాయకత్వం నుంచి ఆశించిన సాయం దక్కకపోవడంతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలం పెంచుకుంది. జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. వై వి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి నెలకొంది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీలో అసమ్మతి నెలకొంది. మరోసారి పోటీ చేస్తే ఓటమి ఖాయమని నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి బరి నుంచి తప్పుకోవడం మేలని శ్రీనివాసులు రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.

మాగుంట కుటుంబానిది సుదీర్ఘ రాజకీయ చరిత్ర.ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా రాజకీయం చేసింది ఆ కుటుంబం. గత ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మాగుంట కుటుంబానికి జగన్ పెద్దపీట వేశారు. అయితే మాగుంట కుటుంబం ఎప్పటినుంచో మద్యం వ్యాపారంలో ఉంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానం మార్చింది. సొంతంగానే షాపులు నిర్వహిస్తోంది. అప్పుడే ఏపీలో మాగుంట కుటుంబ మద్యం వ్యాపారానికి బ్రేక్ పడింది. ఇతర రాష్ట్రాల్లో మద్యం వ్యాపారం చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మాగుంట కుటుంబ సభ్యుల పేర్లు బయటికి రావడంతో శ్రీనివాసుల రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దశాబ్దాలుగా మద్యం వ్యాపారం చేస్తున్నా ఈ పరిస్థితి ఎన్నడూ చూడలేదు. రాజకీయ అరంగేట్రం చేయాలనుకుంటున్న శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి మద్యం కుంభకోణంలో జైలు పాలయ్యాడు. ఇది శ్రీనివాసుల రెడ్డికి అంతగా రుచించలేదు. అధికార పార్టీలో ఉండి ఇబ్బందులు పడడం ఏమిటన్న ప్రశ్న ఆయనను బాధిస్తోంది.

ఒంగోలు పార్లమెంటరీ పరిధిలో పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో.. నెల్లూరు నియోజకవర్గం నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. నెల్లూరు జిల్లాలో సైతం మాగుంట కుటుంబానికి మంచి పట్టు ఉంది. కానీ అక్కడ రాజ్యసభ సభ్యుడు వేంరెడ్డి ప్రతాప్ రెడ్డి పోటీలో దించేందుకు హై కమాండ్ నిర్ణయించింది. దీంతో ఒంగోలు నుంచే శ్రీనివాసరెడ్డిని పోటీ చేయాలని నాయకత్వం ఆదేశించింది. దీంతో ఆయన పునరాలోచనలో పడిపోయారు. ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీలో ఉన్న విభేదాలతో ఇబ్బందులు ఖాయమని భావిస్తున్నారు. అందుకే ఈసారి తాను తప్పుకొని కుమారుడు రాఘవరెడ్డికి పోటీ చేయించాలని ఆలోచిస్తున్నారు. కానీ నాయకత్వం మాత్రం తప్పనిసరిగా శ్రీనివాసరెడ్డి ని బరిలో దించాలని చూస్తోంది. దీంతో ఒంగోలు రాజకీయం ఆసక్తికరంగా మారింది.