విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇలా తాకట్టు పెట్టడానికి కొన్ని ఆస్తులను ఆప్తుల కోసం సృష్టించిన స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు బదిలీ చేస్తున్నారు. ఇప్పటికే ఆస్తులను గుర్తించి నివేదిక రెడీ శారు. తదుపరి కేబినెట్ భేటీలో ఆస్తుల బదలాయింపు నిర్ణయం తీసుకుంటారు. అయితే అంతటితో వదిలి పెట్టడం లేదు.బీచ్ కారిడార్ అభివృద్ధి కోసం మరో కార్పొరేషన్ ఏర్పాటు చేసి భారీగా రుణ సమీకరణ చేయాలని నిర్ణయించారు.
ఇందు కోసం వినూత్నంగా ఆలోచించి బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్ అంటే బీచ్ రోడ్ లో రిసార్టులు, రెస్టారెంట్, గోల్ఫ్ కోర్టులు నిర్మించడం అన్నమాట. మరి వీటికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి. అప్పులు చేయాలంటే ఆ కార్పొరేషన్ కు కొన్ని ఆస్తులుండాలి. వాటిని తనఖా పెట్టాలి అందుకే ఈ బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్ కి ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటున్నారో వాటన్నింటిని బదలాయించి తాకట్టు పెట్టేస్తారన్నమాట.
విశాఖ – భీమిలి -భోగాపూరం బీచ్ రోడ్ లో570 ఎకరాలను ఇందు కోసం గుర్తించారు. వీటిని తాకట్టు పెట్టి దాదాపుగా రూ.వెయ్యి కోట్లు అప్పులు చేయాలని నిర్ణయించారు.అప్పుల కోసం ఏపీ సర్కారు కార్పొరేషన్ల మీద కార్పొరేషన్లు ప్రారంభించి అప్పులు చేస్తోంది. స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో ఇప్పటికే పాతిక వేలకోట్ల దాకా అప్పులు చేసింది.
మెడికల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కట్టబోయే మెడికల్ కాలేజీలన్నింటిని తనఖా పెట్టేసి మరో పదహారు వేల కోట్ల రుణానికి ప్లాన్ చేసింది. అంతా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కార్పొరేషన్లు పెట్టి రుణాలను ప్రయత్నిస్తోందని బీచ్ రోడ్ కారిడార్ కార్పొరేషన్ నిర్ణయంతోనే తెలిసిపోతోంది. మొత్తానికి ఆదాయం పెంచుకోకపోయినా అప్పట్లో క్రియేటివిటీ అయినా చూపించడం రావాలని ఏపీ సర్కారు నిరూపిస్తోంది.