Chandrababu Delhi Tour: చంద్రబాబు ఢిల్లీ వెళ్ళనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత హస్తినలో అడుగుపెట్టనున్నారు. అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు. ముందుగా ఆయనకు మధ్యంతర బెయిల్ దక్కింది. అటు తర్వాత హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.28 తరువాత ఆయన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. అయితే ఇంతలో ఢిల్లీ పర్యటన ఖరారు కావడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాదులోని తన స్వగృహంలో గడుపుతున్నారు. 28 వరకు రాజకీయ కార్యకలాపాలు ఉండకూడదని హైకోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. మరోవైపుతెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఇండైరెక్టుగా కాంగ్రెస్కు టిడిపి మద్దతు పలుకుతోందని టాక్ నడుస్తోంది. అయితే అధికారికంగా టిడిపి నుంచి ఎటువంటి ప్రకటన లేదు. పార్టీ శ్రేణులు మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలుఏపీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడి కానున్నాయి. ఆ ఫలితాలను అనుసరించే చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.
చంద్రబాబు తరుపు కేసులు వాదిస్తున్న లాయర్ సిద్ధార్థ లూధ్ర తనయుడి వివాహం ఈనెల 26న జరగనుంది. ఆ మరుసటి రోజున రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి హాజరయ్యేందుకుగాను చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి ఢిల్లీ వెళ్ళనున్నారు. రెండు రోజులపాటు చంద్రబాబు ఢిల్లీలో గడపనున్నారు. 28 తో కోర్టు విధించిన ఆంక్షలు ముగియడంతో చంద్రబాబు జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అదే సమయంలో రాజకీయ ప్రముఖులను కలిసే అవకాశం ఉందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చంద్రబాబు ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది.
తెలంగాణ తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బిజెపికి సానుకూల ఫలితాలు వస్తే ఒకలా.. వ్యతిరేక ఫలితాలు వస్తే మరోలా.. చంద్రబాబు వ్యూహాలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. బిజెపి వెనక్కి తగ్గుతుందని.. ఏపీలో తన చెప్పు చేతల్లోకి వస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డిని సీఎం పీఠంపై కూర్చోబెట్టి కెసిఆర్ ను, ఇటు జగన్ ను దెబ్బ కొట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు ఢిల్లీ టూర్ వెళ్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరి దృష్టి అటు పైపే ఉంది.