తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా నిధుల సమస్య ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి రప్పించుకోవడం సవాల్ గా మారింద. ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో బాబుకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు నేతలు సైతం తమకు సాయం అందించాల్సిందిగా అర్థిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను దాటుకుని విజయం సాధించాలంటే పెద్ద సాధనే చేయాలనే విషయం స్పష్టమవుతోంది.
గతంలో అధికారంలో ఉండడం వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంతో నిధుల సమస్య రాలేదు. కానీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు కాస్తోకూస్తోో సాయం చేశారు. కేంద్రంతో వైరం కారణంగా పార్టీకి నిధులు రావడం కష్టంగా మారింది. కార్పొరేట్ కంపెనీలు సంప్రదాయంగా పార్టీకి నిధులు ఇస్తున్న వారు కూడా ముఖం చాటేశారు. దీంతో ఈసారి నిధుల కల్పన కష్టతరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నేతలకు నిధులు ఇవ్వడం ఎలాగని బాబు ఇప్పటికే తల పట్టుకుంటున్నారు. పార్టిని గట్టెక్కించే మార్గాలపై అన్వేషిస్తున్నారు.
రిజర్వుడ్ స్థానాలతోపాటు జనరల్ కేటగిరీ అభ్యర్థులు సైతం నిధుల గురించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం అధినేతకు చెప్పలేక నానా తంటాలు పడుతున్నారు. ఎలాగైనా మీరే కాపాడాలని ఇప్పటి నుంచే అభ్యర్థిస్తున్నారు. 2019లో కోట్లు ఖర్చు పెట్టుకుని నష్టపోయామని ఈ సారి తమ వద్ద డబ్బు లేదని చెప్పకనే చెబుతున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు సైతం తమకు నిధులు ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారు.
వైసీపీ తమ వ్యాపారాలను దెబ్బతీసిందని, దీంతో తీవ్రంగా నష్టపోయామని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీకి దీటుగా ఎన్నికల్లో ఖర్చు పెట్టాలంటే పార్టీ నుంచి సాయం అవసరమని చెబుతున్నారు. దీంతో 175 నియోజకవర్గాల్లో దాదాపు వంద స్థానాల్లో చంద్రబాబుకు నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉంటుందంటున్నారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో నిధుల సమస్య ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.