BJP Aim To Win Telangana: ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, 40 పైచిలుకు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు.. ఇదీ తెలంగాణలో బీజేపీ ట్రాక్ రికార్డు. అధికార పార్టీపై జనం ఆగ్రహంగా ఉండడం, కాంగ్రెస్ కన్నా తమనే ప్రతిపక్షంగా ప్రజలు భావిస్తుండటంతో తెలంగాణలో 2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాల పేరిట సభలు నిర్వహిస్తోంది. రెండు రోజులపాటు జరిగే కార్యక్రమాలకు దేశంలోని 29 రాష్ట్రాల బీజేపీ ప్రతినిధులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరవుతున్నారు.

…
ఇక్కడి నుంచే దిశా నిర్దేశం
…
2014 తో పోలిస్తే రెండోదఫా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ బండి అంత సాఫీగా సాగడం లేదు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో రెండోసారి పాగా వేయగలిగినా ప్రతిపక్షాల నోటికి ముకుతాడు పడటం లేదు. పైగా గతంలో ఎన్నడూ లేనంతగా సోషల్ మీడియాలో పార్టీ ట్రోల్స్ కు గురవుతోంది. నేపథ్యంలోనే వాటి అన్నింటికీ చెక్ పెట్టి, 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానం, త్వరలో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాలను కూడా ఇందులో చర్చించనున్నారు. ఉత్తరాది లాగే దక్షిణాదిలో కూడా పట్టు సాధించాలని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉండగా, త్వరలో ఆ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని సుస్థిరం చేసుకుని, తెలంగాణలోనూ పాగా వేయాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే బ్లూ ప్రింట్ సిద్ధం చేశామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇతర పార్టీల పెద్ద నాయకులు మాతో టచ్ లో ఉన్నారని, త్వరలోనే పార్టీలో చేరుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
…
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు
…
ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ కి అర్థ బలం, అంగ బలం రెండూ మెండుగా ఉన్నాయి. పైగా ఇటీవల యువతను భారీగా పార్టీలోకి ఆహ్వానిస్తోంది. దక్షిణాదిన కూడా చదువుకున్న యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ఇంతటి కార్యకర్తల సంపత్తి ఉండటంతో అధిష్టానంలో కూడా ఉత్సాహం ఉరకలెత్తుతోంది. గత నాలుగు దఫాలుగా గుజరాత్ లో అనుసరిస్తున్న “బూత్ లో గెలుపు.. పార్లమెంట్లో గెలుపు” అనే విధానాన్ని దేశమంతా అమలు చేసేందుకు పార్టీ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ వంటి ముఖ్య నాయకులు పదాధికారులతో పలుమార్లు సమావేశం అయ్యారు. గత రెండు దఫాలుగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈసారి కూడా అధికారాన్ని సుస్థిరం చేసుకుని ఉత్తరాది దక్షిణాది అనే తేడా లేకుండా దేశం మొత్తం మీద అధికారంలో ఉండాలని వారు పదాధికారులకు నిర్దేశించారు.
Also Read: Vangaveeti Radha Krishna: జనసేన గూటికి వంగవీటి రాధాక్రిష్ణ.. ముహూర్తం ఫిక్స్..
…
సాధ్యమయ్యేనా
…
దక్షిణాదిన బీజేపీ ఇంత కష్టపడేందుకు కారణం పార్టీ మీద ఉత్తరాది అనే ముద్ర ఉండటమే. ఇప్పటికే దాన్ని చెరిపేసేందుకు నానా తంటాలు పడుతోంది. మరోవైపు ఈ ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో బీజేపీ ఆటలు అనుకునేంత స్థాయిలో సాగడం లేదు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తుండడంతో ఇక్కడ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాదులో బీజేపీ ఫ్లెక్సీలు ఏమాత్రం కట్టేందుకు అవకాశం లేకుండా ఎల్ అండ్ టీ కంపెనీ తో ముందే ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి తోడు “#బై బై మోదీ” అనే హ్యాష్ ట్యాగ్ తో నగరంలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించింది. మోడీ చేస్తున్న ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంకుల ఎదుట, రైల్వే స్టేషన్ ల ఎదుట, ప్రభుత్వ రంగ సంస్థల ఎదుట వినూత్న తరహాలో నిరసన ప్రదర్శనలు ఏర్పాటు చేయిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం అంత సులువు కాదని ముందే హెచ్చరికలు పంపుతోంది. అయితే వీటిని దీటుగా ఎదుర్కోవడంలో బీజేపీ నాయకులు కొంతమేర సఫలీకృతం అయ్యారనే చెప్పవచ్చు. టీఆర్ఎస్ నాయకులకు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మేము కూడా ఏం తక్కువ కాదని బీజేపీ నాయకులు నిరూపిస్తున్నారు. పైగా విజయ్ సంకల్ప సభలో అడుగడుగునా తెలంగాణ తనం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ వంటలు వండేందుకు కరీంనగర్ నుంచి యాదమ్మ అనే మహిళను ప్రత్యేకంగా రప్పించారు. సమావేశాలు నిర్వహించే వేదికలకు కొమరం భీమ్ నుంచి కాళోజీ నారాయణరావు వరకు తెలంగాణలో నిష్ణాతులైన వ్యక్తుల పేర్లు పెట్టారు. కాగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ గెలిచేందుకు పై ఎటువంటి ప్రణాళికలు రూపొందించారో బీజేపీ నాయకులు చెప్పనప్పటికీ నాయకులు, కార్యకర్తలు పరోక్షంగా చేయాల్సింది చేస్తున్నారు.
Also Read: Vijay Devarakonda Bold Look: లైగర్ బోల్డ్ లుక్ వైరల్.. అక్కడ గులాబీలను పెట్టుకున్న విజయ్ దేవరకొండ
[…] Also Read: BJP Aim To Win Telangana: తెలంగాణలో విజయసంకల్పమే బీజ… […]