
Telangana: తెలంగాణలో ఉప ఎన్నికల తంతు మొదలుకానుంది. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టిన నేపథ్యంలో రాష్ర్టంలో మరిన్ని ఉప ఎన్నికలు రావాలని ఆకాంక్షిస్తోంది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి దగ్గర కావడంతో కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారు. దీంతో బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో బీజేపీ రాష్ర్టంలో మరింత బలపడాలని భావిస్తోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం సాగడంతో ఆయన చేరికపై ఇప్పటకే అంచనాలు పెరిగిపోతున్నాయి.
మరోవైపు వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పై పౌరసత్వం కేసు విచారణలో ఉన్నందున ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఎవరిని నియమించాలనే దానిపైనే పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. మునుగోడు, వేములవాడకు ఉప ఎన్నికలు జరిగే పక్షంలో పార్టీని సమాయత్తం చేసే పనిలో పడింది.
గతంలో టీఆర్ఎస్ నేతలు కూడా ఉద్యమ సమయంలో పలుమార్లు రాజీనామాలు చేసి గెలిచిన నేపథ్యంలో ప్రస్తుతం బీజేపీ కూడా అదే తీరుగా బలపడాలని చూస్తోంది. ఇందుకు గాను పలు స్థానాలను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. హుజురాబాద్ లో వచ్చిన విజయంతో మరిన్ని స్థానాలు గెలుచుకోవాలని పథకాలు రచిస్తోంది.