Governars Vs Governaments: ఉత్తర భారత దేశంలో అప్రతిహాత జైత్రయాత్ర చేస్తున్న భారతీయ జనతాపార్టీ.. దక్షిణ భారతదేశంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి కర్ణాటక మినహా దక్షిణ భారత దేశంలో ఎక్కడా సొంతంగా అధికారంలో లేదు. మహారాష్ట్రలో శివసేన షిండే వర్గంలో సర్కార్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేర ళలో కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. వాస్తవంగా దక్షిణాన బీజేపీకి పెద్దగా బలం లేదు. అయినా 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దక్షిణాది నుంచి కూడా వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో పట్టుకోసం గవర్నర్ల సహకారంతో రాజకీయ అలజడి రేపుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అనుకూల ప్రభుత్వాలు లేకపోవడంతో..
దక్షిణాదిన కర్నాటకలో బీజేపీ, మహారాష్ట్రలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలు టీఆర్‌ఎస్, డీఎంకే, వైసీపీ అధికారంలో ఉన్నాయి. కేరళలో మాత్రం వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఆరు దక్షిణాది రాష్ట్రాల్లో మూడింటిలోనూ బీజేపీ వ్యతిరేక పార్టీలే అధికారంలో ఉన్నాయి. కర్ణాటకలో సొంత ప్రభుత్వం.. ఏపీలో సామంత ప్రభుత్వం ఉండటంతో ఆ రెండు రాష్ట్రాల్లో మాత్రం.. వివాదాస్పద బిల్లులను సైతం గవర్నర్లు ఆమోదిస్తున్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే బిల్లులపై ఏపీ గవర్నర్ సంతకం పెట్టేస్తున్నారు. కోర్టులు తప్పు పట్టినా ఆయన పట్టించుకోవడం లేదు. కర్ణాటకలో రిజర్వేషన్ల బిల్లును కూడా అక్కడి గవర్నర్ ఆమోదించేశారు. కానీ కేరళ, తమిళనాడు, తెలంగాణ గవర్నర్లు మాత్రం.. రాజ్యాంగేతరశక్తులుగా మారిపోయారు.
– తమిళనాడు గవర్నర్ డీఎంకె ప్రభుత్వంతో ఢీ కొడుతున్నారు. ప్రతీ దానికి అడ్డం పడే ప్రయత్నాన్ని అక్కడి గవర్నర్ రవి చేస్తున్నారు . మిళనాడు ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదు. వెనక్కి పంపిస్తున్నారు. దీంతో ఇప్పుడు గవర్నర్, సీఎం మధ్య నిప్పు రాజేసుకుంది. అసలు మాకు ఈ గవర్నర్ వద్దని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశారు.
– కేరళ గవర్నర్ ఇంకా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మంత్రుల్ని తీసేయమని ఆదేశాలిస్తున్నారు. చాన్సలర్ అనే హోదా ఉందని రెచ్చిపోతున్నారు. దీంతో ఆయనను చాన్సలర్‌గా తొలగిస్తూ అక్కడిప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది.
– తెలంగాణ సంగతి చెప్పాల్సిన పని లేదు. కళ్ల ముందే కనిపిస్తోంది. తమిళిసై కూడా ఏడు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. వివరణ కావాలని అడుగుతున్నారు. అటు వెనక్కి పంపడం లేదు.. ఇటు ఆమోదించడం లేదు. దీంతో టీఆర్‌ఎస్ ఫైర్ అవుతోంది.
బీజేపీ యేతర రాష్ట్రాల్లోనే దూకుడు..
బీజేపీయేతర ప్రభుత్వాలు ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్న ఢిల్లీ, బెంగాల్, బీహార్, పంజాబ్ వంటి చోట్ల కూడా గవర్నర్ దూకుడు చూపిస్తున్నారు. అధికారం లేని చోట గవర్నర్లతో బీజేపీ ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతోందన్న విమర్శలు ఈ కారణంగానే వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో ఇప్పటికీ అక్కడి తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సర్కార్లు నిత్యం యుద్ధం చేస్తున్నాయి. ఢిల్లీలో గవర్నర్ చొరవతోనే లిక్కర్ స్కాం బయట పడింది. ఇక పంజాబ్‌లోనూ ఆప్ సర్కారే ఉంది. ఇక్కడ కూడా గవర్నర్ తన మార్కు చూపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భగవంత్ మాన్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బల నిరూపణ చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తన ప్రభుత్వం కూల్చే కుట్ర జరుగుతోందని అసెంబ్లీలో బల ప్రదర్శ చేశారు.
గవర్నర్ వ్యవస్థపై సుదీర్ఘ చర్చ..
దేశవ్యాప్తంగా గవర్నర్ల తీరుపై ప్రస్తుత చర్చ జరుగుతోంది. విపక్ష పార్టీలతోపాటు రాజకీయ విశ్లేషకులు కూడా గవర్నర్ల చర్యను తప్పు పడుతున్నారు. గవర్నర్లు ప్రభుత్వ తీరును తప్పు పడితే.. తనను తాను తప్పు పట్టుకున్నట్లే అని అభిప్రాయ పడుతున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌ను అవమానించేలా వ్యవహరించడం, గవర్నర్‌ను తక్కువ చేయాలని చూడడం కూడా మంచిది కాదని పేర్కొంటున్నారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలనే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వాలు రావడానికి కేంద్రం తీరే కారణమన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. రెండు చేతులు కలిస్తేనే శబ్దం వచ్చినట్లుగా.. గవర్నర్, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ప్రజాస్వామ్య వ్యవస్థ ఫరిడవిల్లుతుందని పేర్కొంటున్నారు.