వైసిపి ప్రధాన కార్యదర్శి, పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చట్టాలకు అతీతుడా అనే అనుమానాలు స్వయంగా ఆయన పార్టీ వారికే కలుగుతున్నాయి. ఆయన ఒక అధికార కేంద్రంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలను ఏ మాత్రం పట్టించుకోకుండా, ఉత్తరాంధ్రలో ఆయన విస్తృతంగా తిరుగుతున్నట్లు ప్రతిపక్షాలు ఆధారాతో సహా విమర్శలు గుప్పిస్తున్నాయి.
తాజాగా ఆయన విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తూ తనకు కూడా రక్తదానం చేయడం మరో వివాదాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. వారెవ్వరూ సాంఘిక దూరాన్ని పాటించిన దాఖలాలు లేవు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా రక్తదాన శిబిరాలనుద్దేశించి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ నెల 14న ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రక్తదాన శిబిరాలపై నిషేధం విధిస్తున్నట్టుగా ప్రకటించారు.
అయితే తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడే వారిని దృష్టిలో పెట్టుకుని నిబంధనల్లో కొన్ని సడలింపులు చేశారు. రోగుల రక్తమార్పిడి, చికిత్స, సేవల కొరకు సంబంధిత ఆసుపత్రులకు వెళ్లడానికి వీలుగా ఆ సంస్థలు ఇచ్చిన గుర్తింపు కార్డులను, రక్తమార్పిడి అవసరాన్ని తెలిపే ఆధారాలను పోలీసులకు చూపించి అనుమతి తీసుకోవాలని తెలిపారు.
రెగ్యులర్‌గా ఆసుపత్రులను సందర్శించే వీలుగా పాస్‌లను జారీ చేస్తారని ప్రకటిస్తూ, ఆ తర్వాతే రక్తదానం చేయాలని స్పష్టం చేశాయి. కానీ విజయసాయిరెడ్డి గాని, ఆయనతో వెళ్లిన వారు గాని ఈ నిబంధనను అస్సలు పట్టించుకోలేదు. విజయసాయిరెడ్డి రక్తదానం చేస్తుంటే వైసీపీ నేతలు సాంఘిక దూరం పాటించకుండా ఆయన చుట్టూ చేరి గుంపుగా నిల్చున్నారు.
దీనికి తోడు వైద్య సిబ్బంది సాధారణ మాస్కులు ధరిస్తే.. విజయసాయిరెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్-95 మాస్కులు ధరించి ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా ఈ విధంగా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.