
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకొని మూడు నెలలు దాటినా, ఇంకా ఆ పార్టీతో కలసి ఉమ్మడిగా ఎటువంటి కార్యక్రమాలు చేయకపోవడం, ముందుగా ప్రకటించిన విధంగా రాజధాని అమరావతి తరలింపుకు వ్యతిరేకంగా ఒక్క ఉద్యమం కూడా చేయలేక పోవడం చాలామందికి విస్మయం కలిగిస్తున్నది. బీజేపీలో చాలామంది నేతలు పవన్ కళ్యాణ్ ను దరిచేర్చుకోవడం పట్ల విముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ముఖ్యంగా బీజేపీలో తిరుగులేని నాయకుడిగా, ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ముఖ్యమైన నేతగా గుర్తింపు పొందిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు బిజెపి మరోసారి జనసేనతో చేతులు కలపడం పట్ల అనాసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకనే ఆ రెండు పార్టీల ప్రయాణం ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనుకకు అన్నట్లుగా జరుగుతున్నది.
మొదటగా జనవరిలో అకస్మాత్తుగా బిజెపితో చేతులు కలపడం కోసం తనతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఢిల్లీ రావడం అప్పట్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా కు తీవ్ర ఆగ్రహం కలిగించినట్లు చెబుతున్నారు. అందుకనే రెండు రోజులు ఢిల్లీలో ఉన్నప్పటికీ ఆర్ ఎస్ ఎస్ కార్యాలయంలో కొద్దిమంది నాయకులను తప్ప మరెవ్వరిని పవన్ కలవలేక పోయారు.
ప్రముఖ ఆర్ ఎస్ ఎస్ నాయకుల ద్వారా బీజేపీతో కలవడంకోసం పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు సహజంగానే అమిత్ షా కు అసంతృప్తి కలిగించినట్లు చెబుతున్నారు. అందుకనే మొదటిసారి రెండు రోజులపాటు ఢిల్లీలో ఉండి కూడా పవన్ ను కలవడానికి అమిత్ షా విముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు.
విజయవాడలో బిజెపి నాయకులతో మొదటి సమావేశంలోనే రెండు పార్టీలు కలసి ఉమ్మడిగా అమరావతి రైతులకు సంఘీభావంగా ఉద్యమాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మొదటగా `మార్చ్ తో అమరావతి’ కార్యక్రమం ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం కూడా చేపట్టక పోవడం గమనార్హం.
ఉమ్మడిగా స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసి, ప్రచారం చేయాలని ప్రకటించినా క్షేత్రస్థాయిలో చెప్పుకోదగిన ప్రభావం చూపలేక పోయింది. ఏపీలోని బీజేపీ నేతలలో కన్నా లక్ష్మినారాయణ తప్ప మిగిలిన వారంతా దాదాపుగా అమరావతి విషయంలో బిజెపి తలదూర్చడంపై విముఖంగా ఉండడం గమనార్హం.
డి పురందేశ్వరి, సోము వీర్రాజు, జివిఎల్ నరసింహారావు వంటి నాయకులు ఎవ్వరు ఇప్పటి వరకు అమరావతికి వెళ్ళనేలేదు. రైతులకు సంఘీభావం ప్రకటించలేదు. పైగా, రెండు జిల్లాలకే పరిమితమైన ఉద్యమంలో పాల్గొనడం బిజేపికి ఉపయోగం కాదని వాదిస్తూ వస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ముఖ్యంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దుష్పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడటం కోసం బిజెపితో చేతులు కలుపుతున్నట్లు ప్రకటించారు. అయితే ఏపీలో చాలామంది బిజెపి నేతలు పరోక్షంగా జగన్ మోహన్ రెడ్డితో చేతులు కలిపినవారే. వారెవ్వరూ జగన్ కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలకు సిద్ధంగా లేరు.
అందుకనే పవన్ కళ్యాణ్ తో చేతులు కలపడం చాలామంది బిజెపి నాయకులకు సహితం ఇష్టం లేదని చెబుతున్నారు. పురందేశ్వరి, జివిఎల్ నరసింహారావు వంటి నేతలు సహితం పవన్ కళ్యాణ్ – అమిత్ షా ల మధ్య దూరం పెంచడానికే దోహదపడుతున్నారు.