Actor Ali: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అలీ సిద్ధంగా ఉన్నారా? అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లోనే అలీ పోటీ చేయాల్సి ఉంది. కానీ వైసీపీలో చేరిక ఆలస్యం అయ్యింది. అందుకే పోటీకి వీలు పడలేదు. అప్పట్లో అలీ ప్రచారానికి పరిమితం అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ, ఎమ్మెల్సీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ వంటి పదవులు దక్కుతాయని ప్రచారం జరిగినా.. ప్రభుత్వం మాత్రం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడుగా నియమించి చేతులు దులుపుకుంది. ఎన్నికల్లో మాత్రం ఎలాగైనా పోటీ చేయాలని ఆలీ బలంగా నిర్ణయించుకున్నారు.
జగన్ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటివరకు 70 మంది వరకు సిట్టింగులను మార్చారు. ముఖ్యంగా వైసీపీకి ఎంపీ అభ్యర్థుల కొరత కనిపిస్తోంది. దీంతో చరిష్మ ఉండే వారికి టిక్కెట్లు ఇస్తే తప్పకుండా గెలుపొందుతారని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే క్రికెటర్ అంబటి రాయుడును పార్టీలో చేర్చుకున్నారు. కానీ చేరిన 10 రోజులకి ఆయన దూరమయ్యారు. అయితే సినీ సెలబ్రిటీలకు ఎంపీ స్థానాలకు అప్పగిస్తే బాగుంటుందన్న ఆలోచనకు జగన్ వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలవాలని అలీ భావిస్తున్నారు. గుంటూరు, నంద్యాల, రాజమండ్రి లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేయాలని అలీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలీ ని మీడియా పలకరించగా.. చెప్పుకొచ్చారు. రాప్తాడు సిద్ధం సభ చూశాక వైసీపీ విజయం ఖాయమైందని అని ప్రకటించారు. అలీ సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ చాన్స్ ఇవ్వలేదు. ఆ కారణంతోనే గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అక్కడ కూడా టికెట్ లభించలేదు. మరి ఈ ఎన్నికల్లోనైనా సాధ్యపడుతుందా? చట్టసభల్లోకి అడుగు పెట్టాలన్న ఆలీ కోరిక నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాలి.