Huzurabad By poll: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అక్రమంగా ఈవీఎంలు, వీవీప్యాట్ లు తరలిస్తుండగా బీజేపీ నేతలు పట్టుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈటల గెలుపు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంపగుత్తగా చెప్పిన వేళ నిన్న రాత్రి ప్రైవేటు వాహనాల్లో వీవీప్యాట్ లు తరలిస్తుండగా బీజేపీ నేతలు పట్టుకోవడంతో ఎన్నికల్లో అక్రమాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్ దీనిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో హుజూరాబాద్ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రజా విశ్వాసం కోల్పోయారని ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నిసార్లు సీపీ, కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎన్నికల అక్రమాలు నివారించడంలో కలెక్టర్,సీపీ విఫలం అయ్యారని ఆరోపించారు. ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసిన తరువాత కూడా .. ఓటు వేసిన బాక్స్ లు కూడా మాయం చేయడం దుర్మార్గం, అన్యాయం అన్నారు.
హుజురాబాద్ లో ఆరునెలలుగా అధికార పార్టీ ఆగడాలను నిలువరించడంలో కలెక్టర్, సీపీలు ఉదాసీనంగా వ్యవహరించారని ఈటల ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత సీఎం దళితబంధు జీఓ ఇవ్వడం పెద్ద ఉల్లంఘన అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు ఇక్కడ తిష్ట వేసి దళితబంధు రాదు అని, పెన్షన్ రాదు అని ప్రజలను రకరకాలుగా బెదిరించారన్నారు. ఎన్నిసార్లు సీపీ, కలెక్టర్ కి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఏకపక్షంగా వ్యవహరించారు. దేశచరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పటికీ రాకపోవచ్చు. వారికి ఇంతకంటే ఇలాంటి అపకీర్తి రాకపోవచ్చు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించింది. డబ్బుల, మద్యం వాహనాలను పోలీసులు ఎస్కార్ట్ పెట్టీ మరీ తరలించారు. డబ్బులు పంచే వారికి పోలీసులు బందోబస్తు ఇచ్చారు.
డబ్బులు పెట్టి గెలిచేపద్దతి మంచిది కాదు. డబ్బులతో ఆత్మగౌరవం కొనాలని చూసారని ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యేలు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారు. ఓటు వేయడానికి వేళ్ళే ముందు కూడా ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు ఇచ్చారు. కలెక్టర్,సీపీ విఫలం అయ్యారు. బస్ లలో వెళ్తున్న ఇవిఎం కూడా మార్చినట్టు వార్తలు వస్తున్నాయన్నారు. హుజురాబాద్ నుండి కరీంనగర్ కి గంట సేపు లోపల బస్ లు చేరుకోవాలి. కానీ 12 గంటలవరకు కూడా చేరలేదని సంచలన ఆరోపణలు చేశారు..
ఈవీఎం కరాబ్ అయినవి అని చెప్పి మార్చడం అనుమానాలకు తెరలేపిందని ఈటల ఆరోపించారు. నన్ను ఓడించడానికి కెసిఆర్ అన్ని ప్రయత్నాలు చేశారు. డబ్బులు పంచారు, మందు పంచారు, బెదిరించారు, మభ్యపెట్టారు. చివరికి పోలింగ్ సిబ్బందికి కూడా దావత్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అన్నీ చేసిన కూడా గెలవలేక ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసిన తరువాత కూడా .. ఓటు వేసిన బాక్స్ లు కూడా మాయం చేయడం దుర్మార్గం, అన్యాయం అని ఈటల వాపోయారు. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర , ఢిల్లీ స్థాయిలో కూడా ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.
ఈవీఎంలు మార్చే ప్రయత్నం పట్ల హుజురాబాద్ ప్రజలు ఆందోళన చెందవద్దు. ధర్మందే అంతిమ విజయం అన్నారు. చట్టపరిధిలో కాకుండా సీఎం ఆదేశాల మేరకు చట్ట వ్యతరేకంగా పనిచేసే అధికారుల పై చర్యలు తీసుకునే వరకు ఉపెక్షించమన్నారు. కెసిఆర్ ప్రజా విశ్వాసం కోల్పోయారు. గెలవలేక నీచమైన పనులు చేస్తున్నారు.
ధర్మాన్ని కాపాడు కోవడం మా హుజురాబాద్ ప్రజలు చేసిన సాహసం చరిత్రలో నిలిచిపోతుంది. ఇది మరువలేనిది. ఇలాంటి ఎన్నికలు గతంలో జరగలేదు, భవిష్యత్తులో జరగ వేమో ఇది చారిత్రాత్మక ఘట్టమన్నారు.
కలెక్టర్ పొరపాటు జరిగింది అని చెప్తున్నారని.. ఇది మామూలు ఎన్నిక కాదని ఈటల అన్నారు. ఇంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ఇంత నిర్లక్ష్యమా ?ఇలాంటిది ద్రోహపూరితమైనది. నీచమైనది అంటూ ఈటల సంచలన ఆరోపణలు చేశారు.