Iran: హిజాబ్.. ఇప్పుడు ఇరాన్ లో రగడ సృష్టిస్తోంది. ఎప్పుడూ లేనిది అక్కడి మహిళలు దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పై గళం వినిపిస్తున్నారు. తమ హిజాబ్ లను కాల్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇష్టాలను, అభిరుచులను గౌరవించని రాజ్యాంగం మాకెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. షరియా చట్టం పుట్టి, రకరకాల నిబంధనలను బలవంతంగా అంట గట్టిన ఇరాన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదే సమయంలో భారతదేశంలో హిజాబ్ కావాలని ముస్లిం యువతులు ఆందోళన చేయడం గమనార్హం.

సరిగ్గా రెండేళ్ల క్రితం కేరళ రాష్ట్రంలో క్రిస్టియన్ పాఠశాలలో ధరించి వచ్చిన ముస్లిం యువతులను యాజమాన్యం ప్రశ్నించింది. హిజాబ్ ధరించి రాకూడదని స్పష్టం చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆ యువతులు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన హైకోర్టు మత సంబంధ విశ్వాసాల్లో సున్నితంగా వ్యవహరించాలని, హిజాబ్ ధరించకుంటే వచ్చే నష్టమేంటని పిటిషనర్లను ప్రశ్నించారు. ఏ మత విశ్వాసమైనా కాలానుగుణంగా మారాలని హితవు పలికారు. దీంతో అప్పట్లో ఈ వివాదం ముగిసింది. కొద్ది నెలల తర్వాత కర్ణాటకలో హిజాబ్ ధరించే విషయమై మళ్ళీ రగడ మొదలైంది. కర్ణాటకలోని పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో ప్రభుత్వం కొన్ని రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇదే సమయంలో కొందరు కోర్టుకు వెళ్లారు. అయితే ఈ వివాదం పై పలుమార్లు కేసును వాయిదా వేసిన కోర్టు.. తర్వాత హిజాబ్ కు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. ఒకరి మత విశ్వాసాలు ఇంకొకరికి ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని స్పష్టం చేసింది. పైగా సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో హిజాబ్ కోసం కొట్టుకోవడం ఏంటని ప్రశ్నించింది. పాఠశాలకు, కళాశాలలకు వెళ్ళేటప్పుడు హిజాబ్ ధరించి వెళ్లకూడదని సూచించింది. అయితే కర్ణాటకలో కొంతమంది యువతులు నేటికి హిజాబ్ ధరించి తరగతులకు హాజరవుతున్నారు.
ఇరాన్ లో ఎందుకు వివాదం అంటే
ఇరాన్ ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాల్లో ఒకటి. షరియా చట్టం కఠినంగా అమలవుతున్న దేశం అది. అక్కడి నిబంధన ప్రకారం హిజాబ్ డ్రెస్ కోడ్ పాటించాల్సిందే. జుట్టును పూర్తిగా కప్పేసేలా హిజాబు ధరించాల్సి ఉంటుంది. అక్కడి అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ జూలై నెలలో ఈ నిబంధనలు మరింత కట్టుదిట్టం చేశారు. హిజాబ్ చట్టాన్ని ఉల్లంఘించే మహిళలకు భారీగా జరిమానాల విధించాలని పోలీసులను ఆదేశించారు. హిజాబ్ చట్టాన్ని అనుసరించని మహిళలను శిక్షించేందుకు మొరాలిటీ పోలీసింగ్ అనే విభాగాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో మోహ్సా అమినీ అనే 32 ఏళ్ల మహిళను హిజాబ్ ధరించలేదని మొరాలిటీ పోలీసింగ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. కోమాలోకి వెళ్లి కన్ను మూసింది. అమినీ మృతికి పోలీసులే కారణమని ఆరోపిస్తూ ఆ దేశపు మహిళలు నిరసనకు దిగారు. హిజాబ్ లను నడిరోడ్డు మీద తీసుకొచ్చి కాల్చి తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. అమినీ ను చిత్రవధ చేసి చంపారని పోలీసులపై మహిళలు ఆరోపిస్తున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ప్రారంభమైన ఈ నిరసన దేశం మొత్తం వ్యాప్తి చెందింది. లక్షలాది మంది మహిళలు రోడ్లమీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. పోలీసులు భాష్ప వాయు గోళాలు ప్రయోగించినా వారు చెదిరిపోవడం లేదు.

ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ఎవరి మత విశ్వాసాలు వారివి. కానీ కాలానుగుణంగా అన్ని మతాల్లో మార్పులు ఏర్పడ్డాయి. ఈ మార్పులను స్వాగతిస్తూ అందుకు అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. మహిళలు వంటింటి కుందేళ్లు అనే సత్తె కాలపు మాటలకు స్వస్తి పలకాలి. నేటికీ మహిళలు హిజాబ్ ధరించాలి. లెక్కకు మించి పిల్లలు కనాలి. అనే చాందస భావజాలంతో ఇన్నాళ్లు ఇరాన్ మహిళలు మగ్గిపోయారు. ప్రపంచాన్ని చూస్తున్నవారు.. ఇప్పుడు తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం ఇరాన్ లో మొదలైన ఈ ఆందోళన ముస్లిం దేశాలన్నింటికీ పాకినా పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. తాలిబన్ల ఆధ్వర్యంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లోనూ అక్కడక్కడ నిరసనలు చెలరేగుతున్నాయి. అయితే వీటిని వెలుగు రానివ్వకుండా అక్కడి తాలిబన్లు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఇరాన్ లో నివురు గప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణమైనా రైసీ ప్రభుత్వం కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.